శ్రీశైలంలో నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి : కెఆర్‌ఎంబికి తెలంగాణ లేఖ
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కి స్పష్టం చేసింది.
ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ కెఆర్‌ఎంబికి లేఖ రాశారు.
శ్రీశైలం ప్రాజెక్టును 1959లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా ప్రకటన, 1963లో ప్లానింగ్ కమిషన్ అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులను జత చేశారు.
శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో ప్లానింగ్ కమిషన్, కృష్ణా మొదటి ట్రైబ్యునల్ పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిమట్టం కొనసాగించాలని వాదిస్తున్న ఎపి ప్రభుత్వం, 1991 నుంచి ఇప్పటివరకు ఏప్రిల్, మే నెలల్లో ఏ రోజూ 834 అడుగులకు మించి నీటిమట్టం ఉండేలా చూడలేదని పేర్కొన్నారు.
తెలుగు గంగ, హంద్రీనీవా, వెలుగొండ, గాలేరునగరి సుజల శ్రవంతికి కృష్ణా జలాలను తరలించేందుకే ఎపి ప్రభుత్వం ఈ వాదనను వినిపిస్తోందని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ 294 టిఎంసిలను కృష్ణా బేసిన్ వెలుపలకు అక్రమంగా తరలించిందని పేర్కొన్నారు.
చెన్నై తాగునీటి అవసరాల కోసం పది టిఎంసిలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పటివరకు పెన్నా బేసిన్‌లోని కండలేరు, సోమశిల, వెలిగోడు రిజర్వాయర్లకు శ్రీశైలం నుంచి 95 టిఎంసిల నీరు తరలించారని తెలిపారు. గతేడాది కేటాయింపుల కంటే అధికంగా ఎపి 629 టిఎంసిలను వినియోగించిందని పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుదుత్పత్తితో ఆంధ్రప్రదేశ్‌కు నష్టమన్న వాదన నిరాధారమని, 50-50 నిష్పత్తితో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని, గతంలో చేసుకున్న అవగాహన ఆ ఏడాదికే వర్తిస్తుందని, ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని స్థిరమైన అభిప్రాయానికి రావాలని కృష్ణాబోర్డు చైర్మన్‌ను కోరారు.