శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 21 జులై 2014 (17:58 IST)

నాయిని నర్సింహా రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే : షబ్బీర్ అలీ

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన సబబేనని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జ్ చేయటం సరికాదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. విద్యార్థులను అవమానించే విధంగా మాట్లాడిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణ చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగటం బాధాకరమన్నారు.
 
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రాణాలు అర్పించడం వల్లే కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి, నాయిని నర్సింహా రెడ్డికి హోం మంత్రి పదవి వచ్చాయన్నారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే తమ ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని... వారి ఆందోళన సబబేనని చెప్పారు. తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం చాలా తప్పని తెలిపారు. 
 
తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన విద్యార్థులను అగౌరవ పరిచేలా హోంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. విద్యార్థుల త్యాగాలతోనే సీఎం, హోంమంత్రి పదవులు అనుభవిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలని షబ్బీర్ అలీ మండిపడ్డారు. విద్యుర్థులపై వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.