సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (15:34 IST)

ఒక్క ఉద్యోగం కోసం తీవ్రపోటీ : వాక్ ఇన్ ఇంటర్వ్యూకు పోటెత్తిన నిరుద్యోగులు

unemployement
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. వీటిని రుజువు చేసేలా ఉద్యోగ నోటిఫికేషన్లకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఒకే ఒక్క ఉద్యోగానికి వందలాది మంది నిరుద్యోగులు పోటీపడ్డారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం నిరుద్యోగులు పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
హైదరాబాద్ నగరంలోని ఓ ఐటీ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే ఒక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఖాళీగా ఉందని, అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని పేర్కొంది. ఉన్నది ఒకే ఒక్క పోస్టు కావడంతో రెండు అంకెల్లో నిరుద్యోగులు వస్తారని యాజమాన్యం భావించింది. కానీ, వందల సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో యాజమాన్యం నోరెళ్లబెట్టింది. వచ్చిన వారందరినీ నియంత్రించడానికి ఆ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. జాతరను తలపించేలా కనపించిన నిరుద్యోగులను చూసి హెచ్ఆర్ సిబ్బంది ఖంగుతిన్నారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.