శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (16:20 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ ప్రధాన కోవర్టు : రేవంత్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కోవర్టు సీఎం కేసీఆర్ అంటూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన మంగళవారం సొంత పార్టీ నేత, ప్రత్యర్థి, మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఊహించలేక పోయాయి. ఆ తర్వాత తేరుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ కోవర్టు అని ఆరోపించారు. ఈ కోవర్టుకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినట్టు నటించి యూపీఏ భాగస్వామ్య పక్షాలకు దగ్గరై వాళ్ళ మధ్యన చిచ్చుపెడతాడని అన్నారు. 
 
అలా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి, ప్రధాని నరేంద్ర మోడీ కుర్చీని పదిలం చేయడాని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మోడీకి అనుకూలంగా పని చేయడానికి ఈ కోవర్టు గ్యాంగ్ సుపారీగా తీసుకుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 
 
"సీఎం కేసీఆర్ ఇపుడు ఎవరెవరితో చర్చిస్తున్నారో మీరే ఆలోచన చేయండి. మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీ నేతలతో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ యూపీఏ భాగస్వాములు. నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకించే ముఖ్యమంత్రులు. 
 
సోనియా నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బలంగా సమర్థిస్తున్న నేతలు. వీళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంట్‌, ఫెడరల్ ఫ్రంటో లేక థర్డ్ ఫ్రంటో లేక మరో దిక్కుమాలిన ఫ్రంటో ఏర్పాటు  చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని దెబ్బతీయడానికి ప్రధాని మోడీ ఆదేశాల మేరకు కేసీఆర్ పని చేస్తున్నరాంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.