ప్రజల ప్రాణాలకంటే సినిమా హాళ్లు - పబ్బులు - బార్లే ముఖ్యమా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంతో పాటు.. అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలకంటే సినిమా హాళ్లు, పబ్బులు, బార్లే ముఖ్యమా అంటూ వ్యాఖ్యానించింది. వీటిల్లో రద్దీని తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.
తెలంగాణాలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.
సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని పేర్కొన్న కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని అంటూ ప్రశ్నించింది.
రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా? అని హైకోర్టు మండిపడింది.
ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని.. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొమంటూ తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదావేసింది.