మామ అంత్యక్రియలకొచ్చిన అల్లుడు మృతి... విషయం తెలిసి అత్త కూడా...
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అనారోగ్యంతో చనిపోయిన మామ అంత్యక్రియలకు వచ్చిన అల్లుడు గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన అత్త కూడా షాక్‌కుగురై కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటనతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మూడు రోజుల వ్యవధిలో చనిపోవడంతో ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, చేపూర్ గ్రామానికి చెందిన గడ్డం మల్కన్న, మల్కవ్వ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న మల్కన్న(66) శుక్రవారం మృతి చెందారు. కుమార్తెలు, అల్లుళ్లు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇతర కార్యక్రమాల కోసం ఇక్కడే ఉన్నారు.
ఆదివారం ఉదయం చిన్న కుమార్తె సాయవ్వ భర్త లక్ష్మణ్(45)కు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నిర్మల్ జిల్లా తాండ్రాలకు తీసుకెళ్లారు. మల్కన్న మృతితో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆయన భార్య మల్కవ్వకు అల్లుడి మృతి విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు.
చివరకు అల్లుడు చనిపోయినట్లు మధ్యాహ్నం తెలిసింది. దీంతో మల్కవ్వ(60) షాక్‌కు గురై మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఆమె కూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. భర్త, అల్లుడి మృతితో మనస్తాపం చెందిందని పేర్కొన్నారు.
మల్కన్న, మల్కవ్వల కుమారుడు గంగాధర్ గతేడాది అనారోగ్యంతో చనిపోవడం గమనార్హం. మల్కవ్వ అంత్యక్రియల కోసం గ్రామస్థులు ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు నిర్వహించారు.