మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (13:51 IST)

కాంగ్రెస్ పార్టీవి గలీజు రాజకీయాలు : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గలీజు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతి పనికి అడ్డుపడుతోందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గలీజు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతి పనికి అడ్డుపడుతోందని మండిపడ్డారు. తమది పేదల ప్రభుత్వంమని… పేదల ఆకలి, ఆత్మగౌరవం, ఆలోచన అర్థం చేసుకున్న ప్రభుత్వమన్నారు. సీఎం చల్లగుండాలని దీవిస్తున్నారని… పండుగపూట నాలుగు మంచి మాటలు చెబుతున్నారంటే… అది చాలు అని ఆనందం వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ బన్సీలాల్ పేటలో గురువారం కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల చిరునవ్వుల కోసమే తాము పనిచేస్తున్నామన్నారు. రోడ్లు త్వరలో బాగు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా… ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరతామన్నారు. తమ బాసులు బన్సీలాల్ పేట్ గల్లీల్లో ఉన్నారని.. ఢిల్లీలో లేరని ఘాటుగా విమర్శించారు. రానున్న దీపావళి నాటికి ఎన్ని కమ్యునిటీ హాళ్లు వీలైతే అన్ని కడతామన్నారు.
 
అలాగే, గ్రేటర్ పరిధిలోని రోడ్ల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందులో పురపాలకశాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు, జలమండలి, మెట్రోరైలు, టీఎస్‌ఐఐసీ ఎండీలు, నగర చీఫ్ ప్లానర్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీ చీఫ్ ఇంజినీర్లు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు. 
 
రోడ్ల మరమ్మతులు, కొత్త ప్రాజెక్టులను ఈ టాస్క్‌ఫోర్స్ సమన్వయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసేందుకు రూ.77 కోట్లతో పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం నగర రోడ్లను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు. మొత్తంగా రూ.20 వేల కోట్లతో నగరంలోని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.