ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (15:12 IST)

వైరల్‌గా మారిన ఎంపీ కవిత ట్వీట్.. శభాష్ అంటూ 'సిస్టర్స్ ఫర్ ఛేంజ్‌'కు సపోర్టు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె.కవిత చేసిన ఓ ట్వీట్‌కు దేశవ్యాప్తంగా పలువురు నేతలు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. 'సిస్టర్ ఫర్ ఛేంజ్' అనే పేరుతో ఇచ్చిన ఈ ట్వీట్ ఇపుడు సోష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె.కవిత చేసిన ఓ ట్వీట్‌కు దేశవ్యాప్తంగా పలువురు నేతలు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. 'సిస్టర్ ఫర్ ఛేంజ్' అనే పేరుతో ఇచ్చిన ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్ వివరాలేంటో తెలుసుకుందాం..
 
రక్షాబంధన్. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. సోదరీమణులు ఆ రోజు.. తమ సోదరుల ఇంటికి వచ్చి రాఖీ కట్టి.. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష అని సంకేతమిస్తారు. అలాంటి రక్షా బంధన్ వేడుకను ఈ యేడాది వినూత్నంగా జరిపేందుకు తెరాస ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శ్రీకారం చుట్టారు. 
 
నిజానికి రాఖీ పండుగ రోజు మహిళలు తమ సోదరునికి రాఖీ కట్టి వారి నుంచి బహుమతి అందుకుంటారని, కానీ ఈ సారి మాత్రం రాఖీతో పాటు తమ సోదరునికి రక్షగా ఉన్నామంటూ హెల్మెట్‌ కానుకగా ఇవ్వాలని కవిత సూచించింది. మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘సిస్టర్స్ ఫర్ ఛేంజ్ – గిఫ్ట్ ఏ హెల్మెట్’ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది కవిత. 
 
హెల్మెట్‌ వాడకపోవడంతో దేశవ్యాప్తంగా రోజుకు 400 మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని ట్విట్టర్ వేదికగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాఖీ పండుగ వరకు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తామని ఆమె చెప్పింది. ఇపుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరూ ఈ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ తమ సపోర్టును తెలుపుతూ కవితను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
 
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఈ కార్యక్రమానికి కవిత విస్తృత ప్రచారం కల్పించారు. కవిత ప్రచారానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. గ్రామాల నుంచి పార్లమెంట్ దాకా ప్రచారం కల్పించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలు, ప్రజలు, విద్యార్థినులు మద్దతు తెలిపారు.