సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మే 2020 (13:30 IST)

వందే భారత్ మిషన్ : కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలుగు పౌరులు

కరోనా వైరస్ దెబ్బకు ఆయా దేశాల్లో చిక్కుకున్న భారత పౌరులను కేంద్రం స్వదేశానికి తీసుకొస్తోంది. ఇందుకోసం వందే భారత్ మిషన్ అనే పేరుతో ప్రపంచ చరిత్రలో ఇంతకుముందెన్నడూ జరగని విధంగా స్వదేశీయుల తరలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ మే 13వ తేదీ వరకు జరుగనుంది. ఆ తర్వాత మే 15 నుంచ రెండో దశకు శ్రీకారం చుడుతారు. 
 
ఈ క్రమంలో కువైట్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు గత రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 163 మంది ఉన్నారు. వీరందరినీ క్వారంటైన్ చేశామని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం హోటల్స్ సిద్ధం చేశామని, రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకూ ప్యాకేజీలు ఉన్నాయని, డబ్బు చెల్లించి, క్వారంటైన్ సెంటర్లలో కావాల్సిన సదుపాయాలు పొందవచ్చని, ప్రయాణికుల్లో ఉన్న కూలీలను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌కు తరలించామని తెలిపారు.
 
ఏపీకి చెందిన వారిని కూడా ఇక్కడే క్వారంటైన్ చేయనున్నామని, ఈ విషయంలో ఏపీ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు. కాగా, 46 రోజుల తర్వాత విదేశం నుంచి ఓ విమానం హైదరాబాద్‌కు రావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. 
 
ప్రతి ఒక్కరికీ ఎయిర్ పోర్టులోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని, అందరి టెంపరేచర్, ఇతర ఆరోగ్య వివరాలను రికార్డు చేస్తున్నామని తెలిపారు. అయితే, చిన్నపిల్లలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా హోంక్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు తేల్చి చెప్పారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.