లాక్డౌన్‌పై వెనుకంజ లేదు.. గ్రీన్ జిల్లాలుగా ప్రకటించండి : తెలంగాణ సర్కారు
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టగా భావిస్తున్న లాక్డౌన్ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్టుగా ఈ నెల 29వ తేదీ వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1132కు చేరిందని తెలిపారు.
ఇకపోతే, ఇప్పటివరకు ఈ వైరస్ బాధితుల్లో 29 మంది చనిపోయారనీ, అలాగే, 27 మంది కోలుకున్నట్టు తెలిపారు. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 34 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
అదేసమయంలో ప్రస్తుతం ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కావడం లేదని ఆయన గుర్తుచేశారు. అందువల్ల 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తే 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.
తెలంగాణాల తక్కువ కేసులు నమోదు కావడానికి టెస్టులు అతి తక్కువ సంఖ్యలో చేస్తున్నారనే విమర్శలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తాము ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని, సరైన రీతిలో పరీక్షలు చేయడం లేదన్నది అవాస్తవమన్నారు.