శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (09:15 IST)

మాస్క్ లేకుండా బయటకు వస్తే జైబుకు చిల్లే : తెలంగాణాలో మళ్లీ జనసంచారం

కరోనా వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్టే వేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగిలిన ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంది. ఫలితంగా తెలంగాణాలో గత కొన్ని రోజులుగా అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్ముందు కూడా ఈ వైరస్ వ్యాపించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుంది.
 
ఇందులోభాగంగా, ఈ నెల 17వ తేదీతో ముగియనున్న లాక్డౌన్‌ను మే 29వ తేదీ వరకు తెలంగాణ సర్కారు పొడగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా నిత్యావసర, ఇతర దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది.
 
ఇక లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా నిత్యావసర వస్తువులు, ఉత్పత్తి, విత్తనాలు, ఎరువులు సహా వ్యవసాయ సంబంధ దుకాణాలు వంటి వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి హామీ పనులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, క్లినిక్‌లు, టెలికం, ఇంటర్నెట్, పెట్రోలు పంపులు, పోస్టల్, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, బ్యాంకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు (శ్రామిక్ రైళ్ల మినహాయింపు), అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు(అనుమతి పొందినవారికి మినహాయింపు), మెట్రో రైళ్లు, పాఠశాలలు, శిక్షణ సంస్థలు, హోటళ్లు, లాడ్జీలు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహికంగా మతపరమైన కార్యక్రమాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు వంటి వాటికి జోన్లతో సంబంధం లేకుండా అన్నింటిని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 
 
తెరుచుకున్న దుకాణాలు 
మరోవైపు, లాక్డౌన్ సడలింపుల పుణ్యమాని తెలంగాణా రాష్ట్రంలో నెలన్నర రోజుల తర్వాత మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వ్యాపారులు తమ షాపులు తెరిచారు. దీంతో పట్టణాలతో పాటు.. పల్లెల్లో మళ్లీ జనసంచారం మొదలైంది. రెడ్‌జోన్‌లోని జిల్లాలు మినహా మిగతా వాటిలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 
 
గృహ అవసరాలకు సంబంధించిన దుకాణాలతో పాటు.. మొబైల్ దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. సరిబేసి విధానంలో దాదాపు 50 శాతం దుకాణాలు తెరవడంతో సందడి కనిపించింది. నిబంధనలు సడలించడంతో కొనుగోళ్ల కోసం జనం రోడ్లెక్కారు. ఫలితంగా రోడ్లన్నీ జనంతో కొత్త కళ సంతరించుకున్నాయి. ఈ దృశ్యాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి.