శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (09:22 IST)

కరోనా రోగులకు గమనిక : ఆక్సిజన్ సిలిండర్‌తో వస్తేనే వైద్యం.. ఎక్కడ?

కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి చేయిదాటిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షల మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ దొరక్క కరోనా రోగులు విలవిల్లాడుతున్నారు. కరోనాతో పోరు కంటే ఆక్సిజన్‌ లేక రోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 
 
ఇలాంటి పరిస్థితే గ్రేటర్ వరంగల్‌లోనూ నెలకొంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో వైద్యాధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత మూడు రోజులుగా వరంగల్‌లోని ఆస్పత్రులకు సరిపడా ఆక్సిజన్‌ సరఫరా కావడం లేదు. ఇదే అవకాశంగా తీసుకొని కొందరు ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 
 
రూ.600కు దొరకాల్సిన బల్క్‌ సిలిండర్‌ను రూ.2000కు విక్రయిస్తున్నారు. ఇప్పుడు అది కూడా దొరకడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు కరోనా రోగులను పంపించి వేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ను తెచ్చుకుంటేనే చికిత్స చేస్తామని తెగేసి చెబుతున్నారు. 
 
వరంగల్‌లో ఎంజీఎంతో పాటు 50 ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాయి. కరోనా రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో ఆక్సిజన్‌ వాడకం కూడా గతంలో కన్నా వంద రెట్లు పెరిగింది. ఇదివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు 500 సిలిండర్లు సరిపోయేవి. ఇప్పుడు వెయ్యి సిలిండర్లయినా చాలడం లేదు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు ఐదువేల సిలిండర్లు అందుబాటులో ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వరంగల్‌లో మూడు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటికి సాధారణంగా హైదరాబాద్‌, బల్లార్ష, బెంగుళూరు నుంచి ముడిసరుకు వస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా సరుకు రాకపోవడంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి ఆగిపోయింది. 
 
ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డులో ప్రస్తుతం 250 మంది కరోనా రోగులు ఉన్నారు. వారికి రోజుకు 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది. కానీ అంత అందుబాటులో ఉండడం లేదు. దీనితో రోగులు ఆక్సిజన్‌ కొరతతో విలవిలలాడుతున్నారు. 
 
ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా ఇదే పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చే రోగులను కొన్ని ఆస్పత్రులు ఆక్సిజన్‌ కొరత వల్ల చేర్చుకోవడం లేదు. రోగుల బంధువులు బ్లాక్‌ మార్కెట్‌లో రూ.5 వేలకైనా ఆక్సిజన్‌ సిలిండర్లను కొనడానికి సిద్ధంగా ఉన్నా దొరకడం లేదు.