శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (13:05 IST)

పాతికేళ్ళ కుర్రోడితో దేవసేన ప్రేమాయణం!

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క. బాహుబలి చిత్రంలో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే, ఈమె ఇపుడు పాతికేళ్ళ కుర్రోడితో ప్రేమాయణం జరుపుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆమె ఆ యువకుడిని ప్రేమిస్తున్నట్టు సమాచారం. ఇంతకీ అనుష్క ఏంటి..  పాతికేళ్ళ కుర్రోడిని ప్రేమించడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ వైవిధ్యమైన కథా చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ క్రమంలో అనుష్క శెట్టి ఓ వైవిధ్యమైన చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిందట. అందులోభాగంగా దాదాపు 40 ఏళ్ల వయసున్న మహిళ, పాతికేళ్ల కుర్రాడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా.. లేదా? అనే అంశాలతో ఓ దర్శకుడు కథను సిద్ధం చేశాడట. 
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క నటిస్తే.. ఆమెను ప్రేమించే యువకుడిపాత్రలో నవీన్‌ పొలిశెట్టి కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అనుష్క, నవీన్‌ పొలిశెట్టితో ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరో కాదు.. మహేశ్‌. ఈ డైరెక్టర్‌ ఇది వరకు సందీప్‌కిషన్‌, రెజీనాలతో 'రా రా కృష్ణయ్య' సినిమాను తెరకెక్కించాడు. 
 
డైరెక్టర్‌ మహేశ్‌ చెప్పిన కథ విన్న అనుష్క, ఈ వైవిధ్యమైన ప్రేమ కథలో నటించడానికి అనుష్క ఓకే చెప్పింది. గత ఏడాది ఓటీటీలో విడుదలైన 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిందీ పొడుగుకాళ్ల సుందరి. కానీ 'నిశ్శబ్దం' సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. కాస్త గ్యాప్‌ తీసుకున్న అనుష్క.. ఇప్పుడు మహేశ్‌ దర్శకత్వంలో నెక్ట్స్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.