''నిద్రపోతున్న త్రివిక్రమ్‌ను లేపి మరీ పంచ్ వేసే వాడిని'' : సునీల్
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర స్థాయి దర్శకుడిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గత జీవితం గురించి అభిమానులకు తెలిసిన విషయమే. ఎంతో కష్టపడితే గానీ, త్రివిక్రమ్ ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈయన స్నేహితుడు సునీల్ కూ
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర స్థాయి దర్శకుడిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గత జీవితం గురించి అభిమానులకు తెలిసిన విషయమే. ఎంతో కష్టపడితే గానీ, త్రివిక్రమ్ ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈయన స్నేహితుడు సునీల్ కూడా చాలా కష్టపడి టాప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు హీరోగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా ఈ ఇద్దరూ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన కొత్తలో కష్టాలు పడ్డవారే. పైగా ఇద్దరూ కలిసి జర్నీ చేసారు.
కాలేజ్ డేస్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర్నుండి ఇద్దరూ ఎంతో పాపులర్ అయినా అదే స్థాయిలో వీరి స్నేహం కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉన్నారు. తర్వాత త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా మారి ఈ రోజు టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా ఉన్నారు. ఇక కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ కూడా హీరోగా మారి వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.
తాజాగా వీడు గోల్డ్ ఎహే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సునీల్ ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌కు తనకు ఉన్న సాన్నిహిత్యంతో పాటు తాను త్రివిక్రమ్‌ను ఎలా టార్చర్ పెట్టాడో చెప్పాడు. త్రివిక్రమ్‌లాగా తాను పదునైన పంచ్‌లు వేయలేనని… ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నైట్ పడుకున్నప్పుడు కూడా తాము ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకునేవాళ్లమని చెప్పాడు. తనకు మంచి పంచ్ గుర్తుకు వచ్చాక నిద్రపోతున్న త్రివిక్రమ్‌ను లేపి మరీ పంచ్ వేసే వాడినన్నాడు. అలా త్రివిక్రమ్‌ను చాలాసార్లు టార్చర్ పెట్టేవాడినని సునీల్ అన్నారు.
ఇక త్రివిక్రమ్‌కు ఫ్యాన్ స్పీడ్ ఎక్కువగా ఉంటే నిద్రపట్టదని…అతడు నిద్రపోయాక ఫ్యాన్ స్పీడ్ పెంచేవాడినని దీంతో త్రివిక్రమ్ ''అరెయ్ స్పీడ్ తగ్గించరా..'' అంటూ త్రివిక్రమ్ తనను మోచేత్తో డొక్కలో పొడిచేవాడని అప్పటి మధురస్మృతులను సునీల్ గుర్తు చేసుకున్నాడు.