గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (08:32 IST)

నాలుగు దశాబ్దాల సీతాకోకచిలక

Bharatiraja-aruna-kartik
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై “శంకరాభరణం “ వంటి ప్రతిషాత్మక చిత్రం తరువాత ఎటువంటి చిత్రం రాబోతుందో అనే ఉత్కంఠత సినీ ప్రేక్షకుల్లో ‌ఉండేది.అటువంటి అంచ‌నాల‌ను అందుకోవడం అంత ఆషా మాషీ కాదు. అలాంటిది “ సీతాకోకచిలక “ అనే ఓ టీనేజ్ లవ్ స్టోరీ తో మళ్ళీ ట్రెండ్ సెట్ చేశారు నిర్మాత ఏడిద నాగేశ్వరావు.(ఆగ‌స్టు 21తో సీతాకోక‌చిలక‌కు 40 ఏళ్ళుపూర్తి)

చివరి దాక నిబద్ధ‌త‌తో తాము న‌మ్ముకున్న విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాత‌లు ఉన్నారు. అలాంటి వారిలో పూర్ణోద‌యా మూవీ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వ‌ర‌రావు ఒక‌రు. తాను నిర్మించిన చిత్రాల‌లోనూ, నిర్మాణ‌సార‌థిగా వ్య‌వ‌హ‌రించిన సినిమాల్లోనూ సంగీత‌సాహిత్యాల‌కు, క‌థ‌,క‌థ‌నానికి పెద్ద పీట వేస్తూ సాగారు ఏడిద నాగేశ్వ‌ర‌రావు. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా, టాప్ స్టార్ కాల్ షీట్స్ ల‌భించినా త‌న పంథాలోనే సాగారు త‌ప్ప ఏ నాడూ తాను న‌మ్మిన విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇవ్వ‌లేదాయ‌న‌. ఒకే ఒక్క శంక‌రాభ‌ర‌ణం చిత్రం తీసి నిర్మాత‌గా త‌న అభిరుచిని లోకానికి చాటారు ఏడిద‌. అప్ప‌టి నుంచీ పూర్ణోద‌యా మూవీస్ సంస్థ నుండి వ‌చ్చే చిత్రాల కోసం జ‌నం సైతం ఆస‌క్తిగా ఎదురుచూసేవారు. న‌ల‌భై ఏళ్ళ క్రితం యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకొనేలా ఏడిద నిర్మించిన చిత్రం సీతాకోక‌చిల‌క‌. భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో పూర్ణోద‌యా మూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ ముర‌ళి పేరుతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ముచ్చెర్ల అరుణ నాయిక‌గా ఈ చిత్రం ద్వారానే ప‌రిచ‌య‌మై అల‌రించారు. అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీ కి తన సినీ ప్రస్థానంలో బాల నటుడిగా ఎదిగిన చిత్రం,  ఇళ‌య‌రాజా స్వ‌ర‌క‌ల్ప‌న‌, వేటూరి ప‌ద‌ర‌చ‌న ఈ చిత్రాన్ని మ‌రింత హృద్యంగా మ‌లిచేలా చేశాయి. ఈ నాటికీ ఈ చిత్రంలోని పాట‌లు వీనుల‌కు విందుచేస్తూనే ఉండ‌డం విశేషం.
 
kartik-Aruna
అలైగ‌ళ్ ఒయివ‌త్తిలై  ఆధారం
త‌మిళంలో భార‌తీరాజా తెర‌కెక్కించిన అలైగ‌ళ్ ఒయివ‌త్తిలై చిత్రం ఈ సీతాకోక‌చిల‌క‌కు ఆధారం. ఆ సినిమా షూటింగ్ మొద‌లైన కొద్ది రోజుల‌కే ఈ చిత్రం కూడా ఆరంభ‌మ‌యింది. ఇందులోని క‌థాంశం ఏడిద నాగేశ్వ‌ర‌రావుకు న‌చ్చ‌డంతో దీనిని తెలుగులో ‌చెయ్యాలని అనిపించి “ సీతాకోకచిలక “ నిర్మాణం పూర్తయ్యి ఆగష్టు 21 ,1981 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .
 
క‌థ విష‌యానికి వ‌స్తే –
ఓ బ్రాహ్మ‌ణ‌ అబ్బాయి, క్రిస్టియ‌న్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అందుకు ఆ అమ్మాయి అన్న అంగీక‌రించ‌డు. పైగా ఆ ఊరిలో ఆ క్రిస్టియ‌న్ ఆసామి పెద్ద‌మ‌నిషిగా చెలామ‌ణీ అవుతూ ఉంటాడు. అత‌నికి అడ్డు చెప్పే ధైర్యం ఎవ‌రికీ ఉండ‌దు. అలాంటి ప‌రిస్థితుల్లో హీరో హీరోయిన్ లేచిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. దీనిని అడ్డుకొనేందుకు వ‌చ్చిన అమ్మాయి అన్న‌ను అత‌ను గౌర‌వించే క్రిస్టియ‌న్ ఫాద‌ర్ సైతం వారించి, ప్రేమ‌కు కుల‌మ‌తాలు లేవ‌ని బోధిస్తారు. మ‌తం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని చాటి చెబుతారు. చివ‌ర‌కు ప్రేమ‌జంట సీతాకోక చిలక‌ల్లా తాముకోరుకున్న ప్ర‌పంచంలోకి వెళ్ళ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది. ప్రేమ‌జంట‌గా కార్తిక్, అరుణ న‌టించ‌గా, ఆమె అన్న డేవిడ్ పాత్ర‌లో శ‌ర‌త్ బాబు అభిన‌యించారు. మిగిలిన పాత్ర‌ల్లో సిల్క్ స్మిత‌, రాళ్ళ‌ప‌ల్లి, జ‌గ్గ‌య్య‌, డ‌బ్బింగ్ జాన‌కి, బాల‌న‌టునిగా ఆలీ క‌నిపించారు.
 
ఈ చిత్రానికి క‌థ‌ను మ‌ణివ‌ణ్ణ‌న్ రాయ‌గా, కె.బాబూరావు తెలుగులో స‌హ‌కారం అందించారు. జంద్యాల మాట‌లు క‌థ‌కు బ‌లాన్ని చేకూర్చాయి. ఇక‌ ఇళ‌య‌రాజా, వేటూరి కాంబినేష‌న్ ప్రాణం పోసింది. ఇందులోని అన్ని పాట‌లూ విశేషంగా అల‌రించాయి. ముఖ్యంగా మాటే మంత్ర‌మూ… మ‌న‌సేబంధం… పాట ఈ నాటికీ ప్రేమ‌ప‌క్షుల‌ను ఆక‌ర్షిస్తూనే ఉంది. పాడింది పాడింది ప‌ట్నాల కాకి… అనే పాట‌, మిన్నేటి సూరీడువ‌చ్చెన‌మ్మా…, అలలు క‌ల‌లు ఎగ‌సి… వంటి పాట‌లు కూడా ఇప్ప‌టికీ జ‌నం మ‌దిని దోచేస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర‌ప్ర‌భుత్వ అవార్డును సొంతంచేసుకుంది. ఆ యేడాది ఉత్త‌మ చిత్రంగా బంగారు నందిని సొంతంచేసుకుంది. అలీ కి ఉత్తమ బాల నటుడి నంది అవార్డు కూడా వచ్చింది. ప‌ది కేంద్రాల‌లో శ‌త‌దినోత్స‌వం చూసింది. ఆ త‌రువాత అనేక చిత్రాలు మ‌తాంత‌ర వివాహాల నేప‌థ్యంలో తెర‌కెక్క‌డానికి సీతాకోక‌చిల‌క‌ ప్రేర‌ణ‌గా నిల‌చింది.