శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (17:23 IST)

సారీ నరేష్ గారూ...మీ పద్ధతి నచ్చలేదు.. హేమ అసహనం

ఇటీవల జరిగిన మా ఎన్నికలలో నరేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం రోజున అందుకు సంబంధించిన కొత్త కార్యవర్గం ఏర్పడింది. శుక్రవారం ఉదయం కొత్త కార్యవర్గంతో నరేష్ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, జయసుధ తదితరులు హాజరయ్యారు.
 
ప్రమాణస్వీకారం చేయగానే కొన్ని కానుకలు ప్రకటిస్తున్నానంటూ నరేష్ వరాలజల్లు కురిపించారు. లక్ష రూపాయలుగా ఉన్న మా సభ్యత్వ రుసుమును 90 వేలుకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇంకా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఉపయోగపడే గోల్డ్ కార్డును కేవలం రూ.25 వేలకు అందించనున్నట్లు నరేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన కారణంగా హేమ అలక వహించారు.
 
వేదికపై నటి జీవిత ప్రసంగం తర్వాత హేమ మాట్లాడాలనుకుంది, కానీ నరేష్ మైక్ లాగేసుకుని వద్దు అని వారించాడు. అందరి తరపున మాట్లాడమని కోరినా కూడా నరేష్ వినిపించుకోలేదు. నా దగ్గర మైక్ లాక్కున్నాడంటూ అందరిపైకి గొడవకు దిగుతూ కనిపించింది. ఇది గమనించిన రాజశేఖర్ మాట్లాడమని మైక్ ఇవ్వగా.. ఇదేం బాగాలేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. 
 
నరేష్ ప్రకటించిన ఈ అంశలన్నీ మాలో ఎవ్వరినీ సంప్రదించకుండా తీసుకున్న స్వంత నిర్ణయాలే. ఇలా చేయవద్దు. అందరిలో అసంతృప్తి ఉన్న కారణంగానేనా నన్ను మాట్లాడమని పంపారు. కార్యవర్గంలో ఉన్న 26 మందితో సంప్రదించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏ విషయం అయినా అనౌన్స్ చేయాలి. సారీ నరేష్ గారూ, మీ పద్ధతి నచ్చలేదంటూ వేదికపైనే హేమ చెప్పేశారు. ప్రమాణస్వీకారం రోజే ఇలా ఉంటే ఇక ముందు ఎలా కలిసి పని చేస్తారో చూడాలి మరి.