'మా' పోల్ :: శివాజీ రాజాను ఓడించిన మెగా బ్రదర్ ... స్వతంత్ర అభ్యర్థిగా హేమ గెలుపు
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ అత్యంత ఉత్కంఠ భరితంగా ఎదురుచూసిన మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. ఆ తర్వాత 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, రాత్రి బాగా పొద్దుపోయాక ఫలితాలను వెల్లడించారు.
ఈ ఫలితంగా మా కొత్త అధ్యక్షుడుగా హీరో నరేష్ విజయం సాధించారు. అలాగే, ఈయన ప్యానెల్ తరపున పోటీ చేసిన వారిలో చాలా మంది గెలుపొందారు. నరేష్ ప్రత్యర్థిగా బరిలో నిలిచిన నటుడు శివాజీ రాజా ఓడిపోయారు. నరేష్‌కు 268 ఓట్లు రాగా, శివాజీ రాజాకు 199 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 69 ఓట్ల తేడాతో శివాజీ రాజా ఓడిపోయారు. కాగా, శివాజీ రాజాకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు ముందుగానే ప్రటించిన విషయం తెల్సిందే. ఈయన నిర్ణయం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న వారిలో మెగా ఫ్యామిలీ సభ్యులు సింహభాగంలో ఉన్న విషయం తెల్సిందే.
ఇకపోతే, నరేష్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన నటి జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, కోశాధికారిగా రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు, శివబాలాజీ గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి నటి హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో నటులు నరేశ్, శివాజీ రాజా ఆధ్వర్యంలోని ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. 'మా' అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి.