ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)
ఒడిశాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కాటేసింది. దీంతో తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూతురు తీవ్రంగా శ్రమించింది. ఆమెను తన వీపుపై ఎక్కించుకుని 5 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తల్లికి సకాలంలో చికిత్స అందలేదు. దీంతో ఆమె మరణించింది. ఆ కూతురు తల్లిని వీపుపై మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కంధమాల్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన డుమెరిపడ గ్రామంలో బలమదు మాఝి అనే మహిళ తన పిల్లలతో కలిసి వుంటోంది. అయితే ఆమె శుక్రవారం పాముకాటు గురైంది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ డుమెరిపడ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. అందువల్ల ఆ ఊరికి 8 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే అంబులెన్స్ వచ్చింది.
ఇక చేసేదేమి లేక ఆ తల్లి కూతురు రజని తన వీపుపై ఆమెను ఎక్కించుకుంది. అటవీ మార్గంలో ఐదు కిలోమీటర్ల వరకు మోసుకెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు తల్లిని బైక్‌పై తీసుకెళ్లి అంబులెన్స్ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. అయితే ఆస్పత్రికి చేర్చడంలో ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.