లాక్డౌన్‌తో ఆశల సౌథం కూలిపోయింది : క్రైమ్ పెట్రోల్ నటి సూసైడ్ లేఖ
హిందీ బుల్లితెరకు చెందిన ప్రముఖ నటి, హోస్ట్ ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకుంది. 21 యేళ్ల ఈ నటి క్రైమ్ పెట్రోల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఈమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్న గది నుంచి ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో లాక్డౌన్ కారణంగా తన ఆశలన్నీ కుప్పకూలిపోయాయని పేర్కొంది. ముఖ్యంగా, గత యేడాది కాలంగా తాను నిలదొక్కుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చానని, కానీ, లాక్డౌన్ ఒక్కసారిగా తన ఆశలన్నీ నేలమట్టం చేసిందనీ, అందువల్ల ఇకపై జీవించడం వృధా అని ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని కేసును దర్యాప్తు చేస్తున్న హీరా నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
కాగా, 21 యేళ్ల ప్రేక్ష మెహతా తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో ఆమె ఉపాధిని కోల్పోయి, గత రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది.
అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. కన్న కలలు చనిపోయినప్పుడు... జీవితం చెత్తగా ఉంటుందంటూ అందులో పేర్కొంది. ఈ మెసేజ్ పోస్ట్ చేసిన తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
నిజానికి లాక్డౌన్ ప్రకటించడంతో ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆమె గదిలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడుతుండటాన్ని తొలుత కన్నతండ్రి చూసి షాక్‌కు గురయ్యాడు.
ఆ వెంటనే ఆయన తేరుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు. తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును ప్రారంభించారు. మరణానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.
కాగా, ప్రేక్ష మెహతా... క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ వంటి పలు టీవీ షోలతో పాటు అక్షయ్ కుమార్ చిత్రం 'ప్యాడ్ మేన్'లో కూడా ఆమె నటించింది. ఆమె మృతి పట్ల పలువురు నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.