మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (13:31 IST)

అబ్బే.. అవన్నీ ఉత్తుత్తి వార్తలే : యాంకర్ సుమ

తన నివాసంలో జీఎస్టీ తనిఖీలు జరిగినట్టు వచ్చిన వార్తలపై బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల స్పందించారు. జీఎస్టీ సోదాలు జరిగినట్లు వెలువడిన వార్తలన్నీ అవాస్తవమన్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు హైదరాబాద్‌లో 23 చోట్ల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
ఈ తనిఖీల్లో భాగంగా, సుమ, అనసూయ, రేష్మీ గౌతం తదితర యాంకర్ల నివాసాల్లో కూడా తనిఖీలు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై సుమ స్పందించారు. తమ నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని సుమ కనకాల వివరించారు. 
 
'వినోద రంగంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నవారిలో నేనూ ఒకరిని' అని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ చెల్లించకపోవడంతోనే సోదాలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయని, అవన్నీ వాస్తవ దూరమని కొట్టిపారేశారు.