మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:28 IST)

ముందుగా ఓవర్సీస్‌లో నాలుగు భాషలలో విడుదలవుతున్న "అన్నపూర్ణమ్మ గారి మనవడు"

తెలుగు, తమిళ సినీరంగాకు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు మహానటి జమున నటించిన చిత్రం ''అన్నపూర్ణమ్మ గారి మనవడు''. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించారు. హీరోహీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
కాగా కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో విడుదలలో జాప్యం చోటుచేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓవర్సీస్‌లో ముందుగా విడుదల కానుండటం ఓ విశేషం. ఈ విషయాన్ని శుక్రవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు తెలియజేస్తూ... యు.ఎస్‌తో పాటు ఓవర్సీస్‌లో ఈ నెల 25న ఈ చిత్రాన్ని నాలుగు భాషలలో అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నాం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి ఓ చిన్న చిత్రం ఓవర్సీస్‌లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి.
 
థియేటర్స్ ఓపెన్ కాగానే ఇండియాలో నాలుగు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. 
కళాతపస్వి కె.విశ్వనాధ్ ఈ చిత్రాన్ని చూసి దర్శకుడిగా నన్ను ప్రశంసించడం మరచిపోలేని అంశం. అమరావతి, అన్నవరం, అమలాపురం తదితర ప్రాంతాలలోని కనువిందు చేసే పచ్చని లొకేషన్లలో... ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమిది అన్నారు.
 
అతిథిగా పాల్గొన్న నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... ఒక ఫ్యామిలీ పోస్టర్ చూసి చాలా కాలమైంది. సమాజంలోని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన కుటుంబ కథా చిత్రమిది. ఓ చిన్న సినిమా ఒకేసారి నాలుగు భాషలలో విదేశాలలో విడుదల కానుండటం ఆనందదాయకం అని అన్నారు.
 
మరో అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.... మంచి అభిరుచి గల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి అని అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ... ఇలాంటి మంచి చిత్రం చేయడం మహదానందంగా వుంది. ఇందులో నటించడానికి బాగా అవకాశం వున్న విలన్ పాత్ర పోషించాను అని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సంతోషం సురేష్ మాట్లాడుతూ... ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడం గొప్ప అనుభూతిని కలిగించిందని అని అన్నారు.

సీనియర్ పాత్రకేయుడు వినయకరావు మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో చిత్రం విడుదలలో ఆలస్యం అయినా ఇప్పుడు మంచే జరిగిందని.. నాలుగు భాషలలో అమేజాన్లో విడుదల కానుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది అని అన్నారు. ఇదే వేదికపై అతిథులు చిత్రంలోని నాలుగు పాటలను విడుదల చేశారు.
 
ఈ కార్యక్రమంలో అమేజాన్ ప్రతినిధి రాజీవ్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో శ్రీలక్ష్మి, ప్రభ, జయంతి, సుధ, సంగీత, జయవాణి, బెనర్జీ, రఘుబాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, జీవాలతో పాటు పలువురు తమిళ, మలయాళ నటీనటులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్, ఎడిటింగ్: వాసు, నిర్మాత: ఎం. ఎన్. ఆర్ చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు).