గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (10:13 IST)

మంచితనానికి ఆమె మారుపేరు కావచ్చు.. కానీ ఇంతగా ఆమె ప్రైవసీని వెంటాడవచ్చా..

ఇటీవలి కాలంలో ఒక నటిని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గోప్యతను ఇంతగా వేటాడిన ఘటన మరే నటికీ ఎదురుకాలేదు. ఆమె ఇంటికెళ్లినా, గుడికి వెళ్లినా, ఇంటర్వ్యూకు వెళ్లినా పెళ్లి సంబంధాలు అంటగట్టి, ఎవరు వరుడ

ఇటీవలి కాలంలో ఒక నటిని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గోప్యతను ఇంతగా వేటాడిన ఘటన మరే నటికీ ఎదురుకాలేదు. ఆమె ఇంటికెళ్లినా, గుడికి వెళ్లినా, ఇంటర్వ్యూకు వెళ్లినా పెళ్లి సంబంధాలు అంటగట్టి, ఎవరు వరుడో తామే చెప్పేసి మీడియా గంటకు వంద కథనాలు, పుకార్లు ప్రచారం చేస్తుంటే కూడా ఆమె కిమ్మనలేదు. మరొక నటి ఎవరైనా ఇంత  హటింగ్‌కు గురై ఉంటే ఇంట్లోంచి బయటకు కదిలి ఉండేది కాదు. మిన్ను విరిగి మీద పడినా చలించని మనస్తత్వం, ఎవరేమనుకున్నా ఏమీ అనని మంచితనం. ఎంత దుమారం రేగుతున్నా ఎవరినీ ఒక్క మాట దురుసుగా అనలేని సౌజన్యం.. భూమ్మీద మంచితనాన్ని అంతటనీ రంగరించుకుని ప్రాణం పోసుకున్నదా అనిపించేంత మంచి పేరును సంపాదించుకున్న ఆమె ఎెవరో కాదు దేవసేన అలియాస్ అనుష్క.
 
ఇప్పుడామెకు కొత్త బెడద వచ్చి పడింది. ఆమె ఒంటరిగా గుడికి వెళ్లినా పెళ్లి మొక్కులు తీర్చుకోవడం కోసం వచ్చిందంటున్నారు. పోనీ తల్లిదండ్రులు బంధువులతో కలిసి గుడికి వెళితే ఇంకే.. ఫిక్సయిపోయింది పెళ్ల అంటూ రాసేస్తున్నారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు చేశారని అల్లేస్తున్నారు. కన్నతల్లి ప్రఫుల్లా రాజ్‌శెట్టి, బ్రదర్‌ గుణరంజన్‌ శెట్టి, మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌ ఉండడంతో కచ్చితంగా పెళ్లికి సంబంధించిన పూజలు ఏవో జరిపించుంటారని కథ అల్లేశారు.‘బాహుబలి’ విడుదల తర్వాత మనసుకు నచ్చిన వ్యక్తితో అనుష్క ఏడడుగులు వేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వినిపించిన నేపథ్యంలో తాజా పూజలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
 
రెండు రోజుల క్రితం సాయంత్రం కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు అనుష్క. వీఐపీ సౌకర్యాలు ఏవీ కోరకుండా సాధారణ భక్తులతో కలసి క్యూ లైనులో నిలబడ్డారు. గుడిలోకి ఎంటరయ్యాక ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారట! అనంతరం అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు. ఆ పూజలు ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. కుటుంబం నుంచి ఒక్క మాట బైటికి రాకున్నా కదిల్తే పెళ్లి వార్త, కూర్చుంటే పెళ్లివార్త, గుడికి వెళితే పెళ్లి వార్త. అయినా ఇంతగా వ్యక్తిగత జీవితాన్ని మీడియా వెంటాడి కథలు అల్లేయడం సరైందేనా..
 
పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే అనుష్క సమాధానమైంది. ఇప్పుడూ మౌనంగానే ఉంటారో లేక బదులిస్తారో చూడాలి. ఆమె ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేసింది. ‘‘అనుష్కకు భక్తి ఎక్కువ. రజనీకాంత్‌ ‘లింగ’ షూటింగ్‌ టైమ్‌లోనూ మూకాంబిక గుడికి వెళ్లింది. ఇప్పుడు‘బాహుబలి’ సక్సెస్‌ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది’’ అని అనుష్క  తండ్రి విఠల్‌ పేర్కొన్నారు. మంగుళూరులోని బప్పనాడు దుర్గాపరమేశ్వరీ ఆలయాన్ని కూడా అనుష్క సందర్శించారు.
 
కుటుంబం ఇచ్చిన ఈ వివరణ చూసింతర్వాతైనా అనుష్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకుండా కాస్తంత సంయమనం ప్రదర్శిద్దామా?