సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (12:05 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుప్పెట్లో టాలీవుడ్ : పెద్ద చిత్రాల పరిస్థితేంటి?

కోలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తన గుప్పెట్లోకి తీసుకుంది. కొత్త సినిమాటోగ్రఫీ చట్టానికి ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఏపీలో ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఒకపై ప్రేక్షకుడు సినిమా చూడాలంటే ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్ చేసుకుని వెళ్లాల్సివుంటుంది. ఇది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు, పంపిణీదారులు మింగలేక కక్కలేక, లోలోన ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త చట్టం మేరకు ఏపీలో రోజుకు కేవలం నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాలి. అదీకూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్లను విక్రయించాలి. 
 
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. మిడ్‌నైట్ షోలు, బెన్ఫిట్ షోలు, స్పెషల్ షోలు ఇకపై ఉండవు. కేవలం రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా విడుదలకానున్నాయి. వీటిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. 
 
ముఖ్యంగా, డిసెంబరు 2వ తేదీన బాలకృష్ణ నటించిన "అఖండ" చిత్రం విడుదలకానుంది. డిసెంబర్ 17వ తేదీన అల్లు అర్జున్ నటించిన "పుష్ప" దేశ స్థాయిలో వందలాది స్క్రీన్‌లలో విడుదలకానుంది. ఆ తర్వాత డిసెంబరు 24న హీరో నాని నటించిన "శ్యామ్ సింగారాయ్" విడుదలవుతుంది. నాని కెరీర్‌లోనే తొలిసారి నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
ఆ తర్వాత జనవరికి ముఖ్యంగా సంక్రాంతికి అసలు సందడి కానుంది. జనవరి 7న రాజమౌళి "ఆర్ఆర్ఆర్", 12వ తేదీన పవర్ స్టార్ "భీమ్లా నాయక్", 14వ తేదీన ప్రభాస్ నటించిన "రాధేశ్యామ్" వంటి చిత్రాలు విడుదలకానున్నాయి. అసలే కరోనా కారణంగా దెబ్బమీద దెబ్బతిన్న చిత్రపరిశ్రమ ఇపుడిపుడే కోలుకుంటుందనుకుంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో ఇపుడు చిత్రపరిశ్రమ ఏ స్థాయికి చేరుతుందోనన్న ఆందోళను వ్యక్తం చేస్తున్నారు.