బళ్లు కట్టుకుని వచ్చి మరీ చూస్తున్న శాతకర్ణికి రాయితీ అవసరమా? అదీ వందశాతం
సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అద్భుత విజయం అందుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వ నజరానా ఆకాశమే హద్దు అన్నంత స్థాయిలో దక్కింది. సినిమా విడుదల కాకముందే 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తున్నట్లు జనవరి 9నే ప్రకటించి జీవో జారీ చేసిన ఏపీ ప్రభు
సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అద్భుత విజయం అందుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వ నజరానా ఆకాశమే హద్దు అన్నంత స్థాయిలో దక్కింది. సినిమా విడుదల కాకముందే 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తున్నట్లు జనవరి 9నే ప్రకటించి జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం శాతకర్ణికి గొప్ప మేలు చేసింది. ఈ రాయితీ సినిమాకు మేలు చేస్తోందా లేక ప్రేక్షకులకు మేలు చేస్తుందా అన్నది మొదట్లోనే వివాదాస్పదంగా మారింది.
తెలుగు రాష్టాల ప్రభుత్వాల రాయితీలతో పనిలేకుండా శాతకర్ణి సినిమా తన సత్తా పునాదిగానే ప్రేక్షకులను రంజింపజేస్తోంది. బాహుబలి సినిమాకు చాలా ఏళ్ల తర్వాత బళ్లు కట్టుకుని మరీ థియేటర్లకు వచ్చి చూసినట్లే గౌతమీపుత్ర శాతకర్ణి కూడా సినిమాలను చూడటం మానేసిన జనాలను సైతం తనవద్దకు రప్పించుకుంటోంది. 30 ఏళ్లుగా సినిమాల జోలికి పోని వారు సైతం శాతకర్ణి సినిమాను చూసి వెళుతున్నారని మీడియా చెబుతున్న సందర్భంలో ఈ చిత్రం అద్భుత విజయం సాధించినట్లే లెక్క
కానీ, విడుదల కాకముందే 75 శాతం పన్ను రాయితీని ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు పూర్తిగా సాగిలపడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేయకుండానే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ నెల 9వ తేదీనే 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూటికి నూరు శాతం వినోదపు పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వినికిడి.
కానీ ఏ మసాలాలూ, జిమ్మక్కులూ లేకుండా వాస్తవ ప్రాతిపదిక మీద టాలివుడ్‌లో తీసిన ఎన్నో సినిమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కళాత్మక సినిమా అనేది తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎప్పుడో దాటుకుంది. చిన్న సినిమాలకు అవార్డులు రివార్డుల కంటే ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలుసు.
మరి 60 కోట్లు పెట్టి మరీ తీశారంటున్న భారీ చిత్రం శాతకర్ణికి నూటికి నూరుశాతం పన్ను రాయితీ దిశగా ప్రభుత్వం సాగుతుందంటే దీన్నెలా అర్థం చేసుకోవాలి. అమరావతి సెంటిమెంటా, హీరో తెలుగుదేశం ఎమ్మెల్యే అనా, లేక వియ్యంకుడి సినిమాకు ఆమాత్రం సహాయం చేయకపోతే ఎలా అనే తత్తరపాటా.. ఏది కారణం అనేది తెలియటం లేదు. కానీ రుద్రమదేవి సినిమాకు అడుక్కుంటే కూడా రాయితీ విదిల్చని ఏపీ ప్రభుత్వం శాతకర్ణికి మాత్రం ఇంత తోడ్పాటు అందించడం అవసరమా అనే ప్రశ్న ఇప్పటికే తలెత్తింది.
దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం మౌనముద్ర దాలుస్తుండటం విశేషం.