శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Venu
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (15:13 IST)

'బాహుబలి'ని చూసి వాతలు పెట్టుకుంటున్నారా? జై లవకుశ, సాహో, లై 'ఫ్యూచర్' టాలీవుడ్

తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని అనాలేమో. భారతదేశం అంటే బాలీవుడ్ గురించి మాత్రమే తెలిసిన జనాలకు, తెలుగు సినిమాని పరిచయం చేసిన ఘనత ఇటీవలి కాలంలో ఖచ్చితం

తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని అనాలేమో. భారతదేశం అంటే బాలీవుడ్ గురించి మాత్రమే తెలిసిన జనాలకు, తెలుగు సినిమాని పరిచయం చేసిన ఘనత ఇటీవలి కాలంలో ఖచ్చితంగా మన జక్కన్నదే. ఎన్ని కొత్త పుంతలు తొక్కినా, ఓ మూసలో ఉండిపోయిన తెలుగు సినిమాను స్థాయిని కేవలం బడ్జెట్ విషయంలో మాత్రమే కాక సినిమాను రూపొందించే విషయంలోనూ ఆరితేరారు రాజమౌళి.


బహుశా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే కాబోలు ఇప్పుడు దాదాపు ప్రతి తెలుగు అగ్రశ్రేణి హీరో ప్రపంచస్థాయి టెక్నీషియన్లు, స్టూడియోలు, గ్రాఫిక్స్‌ను మన టాలీవుడ్‌కి దిగుమతి చేస్తున్నారు. మేకప్, ఫైట్లు, కెమెరా వంటి కీలకమైన పనులను హాలీవుడ్ టెక్నీషియన్లకే అప్పగించేస్తున్నారు.
 
యంగ్ టైగర్ నటిస్తున్న "జైలవకుశ"కు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రానికి పని చేసిన హాలీవుడ్ నిపుణుడు వేన్స్ హార్ట్‌వెల్ పని చేస్తున్నారు. తన స్వంత చిత్రాల విషయంలో అంతో ఇంతో దెబ్బతిన్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రం నిర్మాణం విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని దీన్నిబట్టి కూడా తెలుస్తోంది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్స్ చిత్రానికి పని చేసిన కెన్నీ బేట్స్ ప్రభాస్ "సాహో"కి యాక్షన్ కొరియోగ్రఫీని అందించనున్నారు. ఇతను ఇప్పటికే రజనీకాంత్ రోబో 2.0 చిత్రానికి పనిచేసారు కూడా. 
 
వీళ్లు మాత్రమే కాక నటించిన ఒక్క చిత్రమూ అట్టర్‌ఫ్లాప్ అయ్యి, రెండవ సినిమా ప్రారంభించేందుకు సంవత్సరాలు తీసుకున్న అక్కినేని నాగార్జున, అమల వారసుడు అఖిల్ కూడా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ బాబ్ బ్రౌన్‌ని తన తదుపరి సినిమాకు దిగుమతి చేసాడు. టెర్మినేటర్ 2, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి పలు విజయవంతమైన చిత్రాలకు పని చేసిన బ్రౌన్ ఇప్పుడు అఖిల్, విక్రమ్ కుమార్ కాంబినేషన్లోని సినిమాకు పని చేయనున్నారు. అఖిల్ మొదటి సినిమాకు నిర్మాత అవతారమెత్తిన నితిన్ సైతం తన కొత్త సినిమా "లై"లో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జేరియన్‌ను ఓ కీలకపాత్రకు తీసుకున్నాడు. 
 
కానీ సగటు తెలుగు ప్రేక్షకుడికి అవసరమైన అంశాలు లేకపోతే ఎంత గొప్ప టెక్నీషియన్లు పని చేసినా, ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడకతప్పవని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. తెలుగు సినిమా స్థాయిని పెంచి, తమ సినిమాలో ఈ అంతర్జాతీయ టెక్నీషియన్లు పని చేసారని చెప్పుకునేందుకు నటులకు, దర్శకులకు ఎంత గొప్పగా ఉన్నా, ఆ సినిమాకు సరైన స్థాయిలో వసూళ్లు రాకపోతే నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ల సంగతి ఏంటనేదే ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్ళలో జరుగుతున్న చర్చ.