మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (08:36 IST)

ఉత్తరాది అహంకారాన్ని చితకబాదిన బాహుబలి-2 .. దేశవిదేశాల ప్రేక్షకుల నీరాజనం

మరో పాతికేళ్లపాటు ఎవరికీ సాధ్యం కాని విధంగా పది రోజుల్లో వెయ్యికోట్ల రూపాయలు సాధించి వందేళ్ల భారత సినిమా సింహాసనంపై కూర్చున్న రోజు.. ఖాన్‌లు, కపూర్‌లు, బచ్చన్‌లకే సాధ్యంకాని రూ.1,000 కోట్ల వసూళ్లను మన

ఉత్తరాది అహంకారాన్ని ప్రత్యేకించి బాలీవుడ్ అహంకారాన్ని దెబ్బకొట్టిన తెలుగు సినిమాగా బాహుబలి-2 చరిత్రపుటల్లో నిలిచిపోయిన రోజు మే 7, 2017. భారతీయ చలన చిత్ర యవనికపై తెలుగోడు మీసం మెలితిప్పిన రోజు. కేవలం 70 కోట్లకు మించని బడ్జెట్‌తో సరిపెట్టుకునే తెలుగు సినిమా ప్రాంతీయ సరిహద్దులు చెరిపివేసి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసి అందరినోళ్లూ తెరిపించిన రోజది. బాలీవుడ్ తర్వాతే ఏదైనా అనే అహంకారంతో దశాబ్దాలపాటు తలెగరేసిన బాలీవుడ్ పొగరును ఒక తెలుగు సినిమా పూర్తిగా అణిచివేసిన రోజు.. మరో పాతికేళ్లపాటు ఎవరికీ సాధ్యం కాని విధంగా పది రోజుల్లో వెయ్యికోట్ల రూపాయలు సాధించి వందేళ్ల భారత సినిమా సింహాసనంపై కూర్చున్న రోజు.. ఖాన్‌లు, కపూర్‌లు, బచ్చన్‌లకే సాధ్యంకాని రూ.1,000 కోట్ల వసూళ్లను మన తెలుగు సినిమా బాహుబలి–2 కేవలం పది రోజుల్లోనే సాధించేసింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ధ్రువీకరించడంతో ప్రభాస్ అభిమానులే కాదు...యావత్ తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విస్తృతంగా చూస్తే ఇది భారతీయ సినిమా సాధించిన అతి పెద్ద విజయం. 
 
హైదరాబాద్‌లో కూర్చుని మీరు ఇంత భారీ చిత్రాన్ని తీస్తున్నారా అంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినప్పటినుంచి బాహుబలి విజయయాత్ర మొదలైంది. ఒక తెలుగు సినిమా ఇంత చరిత్ర సృష్టింస్తుందని రెండేళ్ల క్రితం ఊహకైనా అందని విషయం. ఎందుకంటే బాహుబలి ప్రారంభమయ్యే నాటికి తెలుగు సినిమా మార్కెట్‌ రూ.50–70 కోట్లు మాత్రమే. అలాంటిది రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఓ ప్రాంతీయ సినిమా నిర్మాణం అంటే అందరూ నోరెళ్లబెట్టారు. మొదలైన రోజు నుంచే సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. 
 
మొదటి భాగం విడుదలయ్యే నాటికి ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. వాటన్నిటిని అందుకుంటూ మొదటి భాగమే అద్భుత విజయం సాధించింది. ఆ స్థాయి విజయాన్ని అసలు ఊహించనే లేదని చిత్రబృందం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. మొదటి భాగం విడిచిపెట్టిన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’అనే ప్రశ్న రెండేళ్ల పాటు ప్రేక్షకులను రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచింది.
 
రెండో భాగం విడుదలయ్యే నాటికే ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని తెలిసినా రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ పది రోజుల్లోనే బాహుబలి ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ను చేరింది. సమీప భవిష్యత్తులో మరే చిత్రం అందుకోలేని రికార్డులను బాహుబలి సృష్టిస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. మొదటి వారాంతానికే 10 మిలియన్‌ డాలర్లను కొల్లగొట్టిన బాహుబలి, ఆ తర్వాత మూడు రోజులకే దంగల్‌(12.36 మిలియన్లు)ను దాటేసింది. ఈ శనివారానికి బాహుబలి 15.2 మిలియన్లను దాటింది. లాంగ్‌ రన్‌లో 20 మిలియన్ల మార్కును అందుకుంటుందని అంచనా.
 
బాలీవుడ్ అహంకారాన్ని బాహుబలి ఎంతగా దెబ్బ కొట్టిందంటే విడుదలైన పది రోజుల తర్వాత కూడా బాలీవుడ్ చిత్రరంగ ప్రముఖులు నోట మాట రాలేదు. హిందీ ప్రాంతంలో ఒక పరాయి భాషా చిత్రం పది రోజుల్లో 300 కోట్లు వసూలు చేసిందన్న సత్యాన్ని వినడానికే వారు సిద్ధంగా లేరు. తమ సినిమాలు, సహచర నటుల సినిమాలు, అవార్డులు వచ్చినప్పుడు విపరీతంగా స్పందించే బాలీవుడ్‌ ప్రముఖులు బాహుబలిపై అస్సలు స్పందించలేదు. పెద్ద హీరోలైన ఖాన్‌ త్రయం ఆమిర్, షారుక్, సల్మాన్‌లు స్పందించకపోగా.. ద్వితీయ శ్రేణి హీరోలైన హృతిక్‌ రోషన్, షాహిద్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, రణ్‌బీర్‌ కపూర్‌ వంటి హీరోలు కూడా నోరెత్తడం లేదు. వరుణ్‌ ధావన్, కరణ్‌ జోహార్, శేఖర్‌ కపూర్‌ వంటి ప్రముఖులు మాత్రం బాహుబలిని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లలో ఒక ప్రియాంక చోప్రా మాత్రమే బాహుబలి-2 చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.