హీరోయిన్ సాయిపల్లవికి షాకిచ్చిన హైకోర్టు
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారించారు. దీన్ని గురువారం హైకోర్టు కొట్టివేసింది.
దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం "విరాటపర్వం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపిన ఘటనలను, ఇటీవల గోవులను తరలిస్తున్న డ్రైవర్ చంపిన ఘటనలను సాయిపల్లవి పోల్చుతూ మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలపై బజరంగ్‌దళ్, వీహచ్‌పీ సభ్యుడు అఖిల్ సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 21న పోలీసులు నోటీసులు జారీ చేయగా వీటిని సవాలు చేస్తూ సాయిపల్లవి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాశ్మీర్ ఉగ్రవాదులతో గోసంరక్షులను పోల్చారంటూ ఫిర్యాదు ఇవ్వడం సరికాదని, మానవత్వంతో ఉండాలని మాత్రమే సాయిపల్లవి చెప్పారని అన్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, కేవలం వాస్తవాలను ధ్రువీకరించుకోవడానికే నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.