శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (16:17 IST)

హౌస్‌మేట్స్‌ను కిందికి తోసేసిన అలీ...నాయకత్వ పోరులో ఉన్న ఆ ముగ్గురు

ఇటీవల ప్రారంభమై తెలుగులో మంచి టిఆర్పీలు సాధిస్తున్న 'బిగ్ బాస్' మునుపటి సీజన్లతో పోలిస్తే ఈసారి మరింత రసవత్తరంగా మారింది. పెద్దగా పేరున్న కంటెస్టెంట్స్ లేకపోయినా మొదటి వారం నుండి హౌస్‌లో గొడవలు, వాటి వలన గ్రూపులుగా విడిపోయిన సభ్యులు, ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల వలన వచ్చే విభేదాలతో మూడు తిట్లు ఆరు గొడవలతో సాగిపోతోంది బిగ్ బాస్. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఫిజికల్ టాస్క్ ఫైటింగ్‌కు దారి తీసింది. 
 
మంగళవారం హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో హిమజ జట్టుతో పోలిస్తే శ్రీముఖి టీమ్ ఎక్కువ జెండాలను పాతినప్పటికీ బజర్ మోగే సమయానికి రెండు టీమ్‌లలో ఒక్క సైనికుడు కూడా మిగలకపోవడంతో ఏ జట్టూ విజయం సాధించలేదని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని ఉన్న అలీ, రవి, రాహుల్ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడతాడని వివరించడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసిపోయింది.

ఇక బుధవారం ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయగా, అందులో కెప్టెన్సీ టాస్క్ జరగబోయే క్రమాన్ని చూపించాడు. క్యాప్టన్ పోటీదారులుగా ఉన్న అలీ, రవి, రాహుల్ పోటీలో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన సింహాసనంపై బజర్ మోగే వరకు ఎవరు కూర్చుని ఉంటారో వాళ్లే ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ లెటర్‌లో పేర్కొన్నాడు.
 
అందరి కంటే ముందుగా అలీ రేజా వెళ్లి సింహాసనంపై కూర్చోగా, అతడిని దించేందుకు మిగిలిన ఇద్దరు పోటీదారులు, వారికి మద్దతుగా కొందరు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అలీ అక్కడ ఉన్న ఆస్తిని ధ్వంసం చేయడంతో పాటుగా తన దగ్గరకు వస్తున్న రాహుల్, రవికృష్ణలను పై నుంచి కిందికి తోసేశాడు.

ఈ ఘటన చూసిన అందరూ షాకయ్యారు. ఇక క్యాప్టన్ పోటీదారులలో రవికృష్ణకు ఇప్పటికే గాయమై ఉన్నందున ఫిజికల్లీ ఫిట్‌గా ఉన్న మిగతా ఇద్దరికి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.