సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (17:26 IST)

#ViralVideo కత్తులతో వచ్చిన దొంగలు.. తరిమికొట్టిన వృద్ధ దంపతులు (video)

సోషల్ మీడియాలో వృద్ధ దంపతులు దొంగలతో పోరాడిన వీడియో వైరల్ అవుతోంది. ఇంట్లో దోపిడి చేయాలని వచ్చిన దొంగలను వృద్ధ దంపతులు చితకబాదారు. ముఖాలను కప్పేసుకుని వృద్ధ దంపతులపై దాడికి పాల్పడిన ఆ దొంగలకు ఆ వృద్ధ దంపతులు ధైర్యం చేసుకుని తిరగబడ్డారు.


శక్తినంతా కూడగట్టుకుని వారిపై దాడి చేశారు. చేతికి దొరికిన వాటితో దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం వీడియో సైతం వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి, కడయంలో కత్తులతో దొంగతనానికి వచ్చిన ఇద్దరు ఆగంతకులను వృద్ధ దంపతులు వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఓ వృద్ధుడు తన ఇంట్లో కూర్చొని పని చేసుకుంటుండగా.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చిన ఓ ఆగంతకుడు వృద్ధుడి మెడలో టవల్‌ వేసి స్తంభానికి కట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే తేరుకున్న ఆ వృద్ధుడు, ఆతని భార్య దొంగలపై దాడికి పాల్పడింది. 
 
ఈ క్రమంలో దొంగలకు, ఆ వృద్ధ దంపతులకు పెనుగులాట జరిగింది. ఇక ఆ వృద్ధుడైతే తన మెడకు కట్టిన టవల్‌ నుంచి విడిపించుకొని తమ వద్ద ఉన్న కుర్చీలతో ఆగంతకులపై ఎదురుదాడికి దిగారు. ఆగంతకులు కత్తులతో బెదిరించినా ఏమాత్రం జడుసుకోకుండా కుర్చీలతో దాడి చేసి దొంగలకు చుక్కలు చూపించారు. అలా ప్రతిఘటించి వారిని తరిమి తరిమి కొట్టారు. దీంతో ఆ దుండగులు పారిపోయారు. 
 
ఇంకేముంది..? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని వృద్ధ దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. వృద్ధులైనా దొంగలను ధీటుగా ఎదుర్కొన్నారని.. ప్రతి ఒక్కరూ ధైర్యంగా వుండాలని అభిప్రాయాలు పోస్టు చేస్తున్నారు.