1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (09:40 IST)

రజనీకాంత్ ఐసీయూలో ఉన్నారా? పీఆర్వో ఏమంటున్నారు?

ఉన్నట్టుండి గురువారం అస్వస్థతకు లోనైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కానీ, ఆయన పీఆర్వో రియాజ్ కె అహ్మద్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. రోటీన్ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరారనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 
 
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రజనీకాంత్ చేరారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకున్న ఆయన అంతలోనే ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల్లో ఆందోళన చెందారు. 
 
ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో.. ఆయన అనారోగ్యానికి గురయ్యారని, తీవ్ర అస్వస్థత చెందారంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై రజనీ సతీమణి లత మాట్లాడుతూ.. ఏటా నిర్వహించే సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆయన కావేరీ ఆస్పత్రికి వెళ్లారని, అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత నగరానికి వచ్చారు. బుధవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం అన్నాత్తను చూశారు. ఈ క్రమలో గురువారం ఉదయం నుంచి కాస్త నలతగా ఉన్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కావేరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయగా, రక్తనాళం పగిలినట్లు గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రజనీ క్షేమంగా ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.