ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే `మిషన్ ఇంపాజిబుల్` అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు.
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్లలుగా రోషన్, బానుప్రకాష్, జైతీర్థ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు.
- మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా.
- రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా.
- మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదాని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫిషనల్ యాక్టర్. ముందురోజే డైలాగ్‌లు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరుగంటకల్లా సెట్‌కు వచ్చేది.
- ఈ కథ అనుకున్నప్పుడే థ్రిల్లర్ అనుకున్నాం. ముగ్గురు పిల్లలు (రోషన్, బానుప్రకాష్, జైతీర్థ) దావూద్‌ను పట్టుకోవడం అనేది కామెడీగా అనిపించి చేశాం. ఇందులో 60 శాతం కామెడీ వుంటుంది. మిగిలింది థ్రిల్లర్.
- వేసవిలో సమ్మర్ హాలిడేస్, ఉగాది పండుగ, సింగిల్ రిలీజ్ కాబట్టి పెద్ద సినిమాలున్నా చిన్న సినిమా కూడా విడులచేస్తే వర్కవుట్ అవుతుందని భావించి రిలీజ్ చేస్తున్నాం. కథ బాగుంటే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం మాకుంది.
- ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పిల్లలో ఒకరు దావూద్ ఫొటో చూసి రామ్‌గోపాల్ వర్మ అనుకుంటాడు. నేను చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని. నాలాగే ఎంతోమంది అలా అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ చాలా పోలికలుంటాయి. అందుకే ట్రైలర్‌లో చూపించాను.
- అలాగే పిల్లల పేర్లు చెబుతూ. రఘుపతి, రాఘవ, రాజారాం.. ఆర్.ఆర్.ఆర్. అంటూ స్టయిలిష్‌గా చెబుతారు. ఆ వెంటనే ఇషప్ శెట్టి.. కలీల్, జిలాని, ఫరూఖ్.. కెజి.ఎఫ్. అంటూ తమ ముగ్గురు పేర్లు చెబుతాడు. ఇవి ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణను క్రియేట్ చేశాయి. ఇవి మేం అనుకోకుండా పెట్టిన పేర్లే. ఇప్పుడు ఆ రెండు పేర్లతో సినిమాలు వచ్చాయి. యాదృశికంగా ఆ రెండు సినిమాల మధ్య మా సినిమా విడుదల కావడం థ్రిల్‌గా అనిపిస్తుంది.
- ఏజెంట్.. సినిమాను లిమిట్ బడ్జెట్‌తో తీశాం. ఇప్పుడు ఈ సినిమాను కూడా పరిమిత బడ్జెట్‌తో తీయగలిగాం.
- ప్రతిష్టాత్మకమైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. భారీ సినిమాలే కాకుండా కంటెంట్ వున్న సినిమాలను తీసే నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పిల్లలపై కాన్సెప్ట్ విని చాలా కొత్తగా ఆలోచించారని తెలిపారు. తాప్సీ నటించడం సినిమా చాలా హెల్ప్ అవుతుందన్న సూచనను వారు అంగీకరించడం కూడా సినిమాకు ఎస్సెట్‌గా భావిస్తున్నా.
- ఇందులో తాప్సీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించింది. మిగతా సపోర్టింగ్ పాత్రలలో హరీష్ పారడి, రవింద్రమేన్, సుహాన్, హర్షవర్థన్, సందీప్. వైవా హర్ష, ఇషప్ శెట్టి తదితరులు నటించారు.
- ఇందులో ముగ్గురు పిల్లల ఎంపికకు నెలరోజులపట్టింది. ఇప్పుడు పిల్లలు వయస్సుమించిన మాటలు మాట్లాడుతున్నారు.. బాడీ లాంగ్వేజ్‌కూడా అలానే వుంటుంది. ఇంటర్‌నెట్ వల్లకావచ్చు మరేదైనా కావచ్చు పిల్లల్లో అమాయకత్వం మిస్ అయింది. అందుకే ఆ వయస్సు పిల్లలు ఎలా వుండాలి. వారిలో ఇన్నోసెన్స్ కనిపించాలనే కేర్ తీసుకుని ఎంపిక చేశాం. `తారా జమీన్ పర్`, `లిటిల్ సోల్జర్స్` ఎందుకు నచ్చాయంటే వయస్సు తగినట్లు ఆ పాత్రలుంటాయి. అందుకే పిల్లలకు తగినట్లు రాసుకున్నా.
- పిల్లలకు 60రోజులు వర్క్‌షాప్ నిర్వహించాం. మండువా హౌస్ సెట్‌లో ముందుగా అసిస్టెంట్ దర్శకుల సమక్షంలో వారికి శిక్షణ ఇప్పిచడంతో వారు ఈజీగా నటించడానికి అవకాశం కలిగింది.
- టైటిల్ ఆంగ్లంలో `మిషన్..` అనేది పెట్టడానికి కారణం కూడా పిల్లలు స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. అందుకే అలా పెట్టాం. సినిమా చూస్తే అర్థమవుతుంది.
- షూటింగ్‌ను మన నేటివిటీకి తగినట్లుగానే తీశాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలలో షూట్ చేశాం.
- అయితే ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నాం. మిగతా భాషల్లో రీమేక్ చేస్తేనే అక్కడి ఒరిజినాటిటీకి కనెక్ట్ అవుతారు. డబ్ చేస్తే బాగోదనిపించింది.
- కొత్తగా ఎటువంటి సినిమాలు కమిట్ కాలేదు. ఏజెంట్...కు సీక్వెల్ తీయాలనుకున్నాం. కాని దానికి మించి వుండాలి. అందుకే సమయం తీసుకుని చేయాలనుంది. ఏజెంట్.. ను హిందీలో తీయాల్సి వస్తే పూర్తి నేటివిటీ మార్చి తీయాలి. దానికి నేను దర్శకత్వం వహించను. అని అన్నారు.