షూటింగులకు అనుమతినిచ్చిన సీఎం కేసీఆర్ - ఫలించిన చిరు చర్చలు
సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మూవీ షూటింగులకు ఆయన పచ్చజెండా ఊపారు.
హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో శుక్రవారం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ విన్నపాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, షూటింగ్‌లు, ప్రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, థియేటర్ల పునఃప్రారంభంపై చర్చించారు. షూటింగ్‌లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని సీఎంను సినీరంగ ప్రతినిధులు కోరారు.
సినీ ప్రముఖుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని సీఎం అన్నారు. జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లపై విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.
లాక్డౌన్ కారణంగా నిలిచిన సినిమా షూటింగ్‌లు, రీప్రొడక్షన్లు దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు, కొవిడ్ నివారణ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్.. సినీ పెద్దలకు సూచించారు.
కాగా, ప్రగతి భవన్‌లో సీఎంను కలిసిన వారిలో హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, సి కళ్యాణ్, దర్శకులు రాజౌళి, కొరటాల శివ, ఎన్. శంకర్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమై అన్ని విషయాలు చర్చించారు. ఈ సమావేశం గురువారం చిరంజీవి నివాసంలో జరిగింది. ఇందులో కూడా పలువురు సినీ హీరోలు, అగ్రదర్శకులు పాల్గొన్నారు.