శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:34 IST)

తమిళ సూపర్ స్టార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. 
 
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు రజినీకాంత్ చేసిన సేవలకు గుర్తుగా ఈ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదాన చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవార్డుకు రజినీకాంత్ పేరును సిఫార్సు చేసిన జ్యూరీ సభ్యులు ఆషాభోంస్లే, సుభాష్ ఘయ్, మోహన్‌లాల్, శంకర్, బిశ్వజిత్ ఛటర్జీలకు కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

కాగా, భారతీయ సినిమాకు విశేషంగా సేవలు అందించిన వారిని గుర్తించి, ఎంపిక చేసివారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఇది 1969లో ప్రారంభమైంది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు.
 
హిందీ చిత్ర సీమ నుండి 32 మంది ఈ అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భారతీయ భాష రంగం నుంచి ఎంపికయ్యారు. గ‌త ఏడాది రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న విష‌యం తెలిసిందే. 
 
త‌మిళ‌నాడు ఎన్నికలు ఏప్రిల్‌ 6న జ‌ర‌గ‌నుండ‌గా, ఎల‌క్ష‌న్స్ ముందు కేంద్రం ఈ అవార్డ్ ప్ర‌క‌టించ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. ర‌జ‌నీకాంత్ 2000లో ప‌ద్మ‌భూషణ్‌, 2016లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాలు అందుకున్న విష‌యం తెలిసిందే.