మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 3 జులై 2021 (14:10 IST)

న‌ట‌న‌కు నిర్వ‌చ‌నం, స్పుర‌ద్రూపి ఎస్‌.వి.రంగారావు

SV Rangarao
న‌టుడు ఇలా వుండాలి. న‌టించ‌డం అంటే ఇలా చేయాలి. న‌టుడికి ఆహార్యం కీల‌కం అంటూ శిక్ష‌ణాలంయ‌లో చెబుతుంటారు. అన్నింటికంటే ముఖ్యం స్పుర‌ద్రూపిగా వుండ‌డం. చెప్పిన విష‌యాన్ని వెంట‌నే ప‌సిగ‌ట్టి సింగిల్‌టేక్‌లో చెప్ప‌డం అనేది ఒక అంశం. దీన్ని పుణికిపుచ్చుకున్న న‌టుడు ఎస్‌.వి. రంగారావు అనే చెప్పాలి. త‌న‌కు చెప్పిన పేజీల డైలాగ్‌ను కూడా ఒక్కసారి విన్న వెంట‌నే అవ‌లోక‌గా చెప్పేసేవాడు. తెలుగు చ‌ల‌న‌చిత్ర‌రంగం సువ‌ర్ణాధ్యాయంలో ఒక వెలుగు వెలిగిన ఎస్‌.వి. రంగావు జ‌యంతి నేడే. యస్.వి. రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న సామర్ల కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మ లకు కృష్ణాజిల్లాలోని నూజివీడులో జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసేవారు. తాత కోటయ్య నాయుడు నూజివీడులో పేరున్న వైద్యులు. ఆయన చెన్నై దగ్గరలోని చెంగల్పట్టులో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గా పనిచేయడంతో రంగారావు కూడా నాయనమ్మ దగ్గరే చెన్నయ్ లో ఉన్నారు.
 
1947లో ‘వరూధిని’ చిత్రంచేసిన వెంట‌నే గుర్తింపురాలేదు. మ‌ర‌లా వెన‌క్కి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నారు. 1950లో ‘షావుకారు’లోని ‘సున్నం రంగడు’ పాత్ర ఆయనను వ‌రించింది. ఆ తర్వాత విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘పాతాళ భైరవి’ చిత్రం ఘనవిజయం సాధించడంతో కెరీర్ మారిపోయింది. భయపెట్టడమే కాదు, కరుణరసం కురిపించి ఆకట్టుకోవడంలోనూ మేటి. పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, ఏదైనా సరే ఎస్వీ రంగారావు అవలీలగా ఆకళింపు చేసుకొనేవారు. నర్తనశాల’లోని కీచక పాత్ర జ‌కార్తాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమనటునిగా రంగారావు జేజేలు అందుకున్నారు. ‘భట్టి విక్రమార్క’, ‘బాలనాగమ్మ’, ‘విక్రమార్క విజయం’ వేటిక‌వే వైవిధ్య‌మైన పాత్రలు వేసి మెప్పించారు.
 
ద‌ర్శ‌కుడిగా విజ‌యం
ఎస్‌.వి. రంగారావు ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు వ‌చ్చాయి. 1967లో ‘చదరంగం’, 1968లో ‘బాంధవ్యాలు’ చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలకూ నంది అవార్డులు రావడం విశేషం. తెలుగులోనే కాకుండా ఎస్వీయార్ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.
 
అభిమానులు విగ్ర‌హాలు క‌ట్టించారు
1974 ఫిబ్రవరిలో హైదరాబాద్ కు షూటింగ్ కు వచ్చిన ఎస్‌.వి.రంగారావుకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఉస్మానియా హాస్టిటల్ కు తరలించి వైద్యం చేయించారు. ఆ తర్వాత చెన్నయ్ వెళ్ళిన కొన్ని నెలలకు జూలై 18న మధ్యాహ్నం వచ్చిన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అందుకే ఆయ‌న్ను స్మ‌రించుకుంటూ అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతిష్ఠింపచేశారు. ధవళేశ్వరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు పట్టణాలలో ఎస్వీయార్ విగ్రహాలు నాలుగు రోడ్ల కూడళ్ళలో నిలిచి ఆయన్ని ప్రజలు సదా స్మరించుకునేలా చేస్తున్నాయి.
 
అయితే ఆయ‌న వార‌సులు ఎవ్వ‌రూ సినీరంగంలోకి రాలేక‌పోయారు. ఆయ‌న‌కు కుమార్తెలు ఇరువురు. ఓ కుమార్తెకు చెందిన కుమారుడు 5 ఏళ్ళ నాడు హీరోగా న‌టించ‌డానికి వ‌చ్చాడు. కానీ ఇక్క‌డ స‌రైన ఆద‌ర‌ణ దొర‌క‌లేదు. తీసిన సినిమా క‌థ కూడా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో అది రిలీజ్ అయి వెంట‌నే వెళ్ళిపోయింది. మ‌ర‌లా అత‌ను క‌నిపించ‌లేదు.