గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (12:48 IST)

డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమను మాత్రమే దోషిని చేయొద్దు : ఎంపీ సుమలత

డ్రగ్స్ వాడకం కేవలం సినీ ఇండస్ట్రీలోనే జరగడం లేదనీ, ప్రతి రంగంలోనూ ఉందని సినీ నటి, మాండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత అంబరీష్ అన్నారు. పైగా, డ్రగ్స్ కేసులో కేవలం సినీ ప్రముఖులను మాత్రమే దోషులుగా చూపొద్దని ఆమె హితవు పలికారు. 
 
ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలతో పాటు మరికొందరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ వ్యవహారంపై సీనియర్ నటి అయిన సుమలత స్పందించారు. డ్రగ్స వ్యవహారంలో కేవలం సినీ పరిశ్రమను మాత్రమే వేలెత్తి చూపవద్దని హెచ్చరించారు. ప్రతి రంగంలోనూ మంచి, చెడులు ఉన్నాయని, డ్రగ్స్ కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే వాడతారా? అని ప్రశ్నించారు.
 
తాను ఎన్నడూ మత్తుమందులను వాడలేదని స్పష్టం చేసిన ఆమె, యువత విషయంలో మాత్రం వస్తున్న ఆరోపణల్లో కొంత నిజాలున్నాయని అన్నారు. డ్రగ్స్ లేవని తాను చెప్పడం లేదని, లోతైన దర్యాఫ్తు చేస్తే, నిజానిజాలన్నీ వెలుగులోకి వస్తాయని, అప్పటివరకూ వేచి చూడాలన్నదే తన అభిమతమని అన్నారు.
 
అదేసమయంలో ఎవరి వద్దనైనా మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలకు సంబంధించిన ఆధారాలు ఉంటే, వాటిని దర్యాఫ్తు సంస్థలకు అందించాలని సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని, కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన, వారిని దోషులుగా చూడవవద్దని సూచించారు. వచ్చిన ఆరోపణలు రుజువయ్యేంత వరకూ ఎవరికి తోచిన విధంగా వారు తీర్పులను ప్రకటించేయడం సరికాదని హితవు పలికారు.
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. ఈకేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షౌవక్ చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ముంబైలో అరెస్టు చేసింది.