సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:29 IST)

తెలుగు ప‌రిశ్ర‌మను చూసి జ‌ల‌సీ ఫీల‌వుతున్నారు - ఒకే ఒక జీవితం దర్శకుడు శ్రీకార్తిక్

Srikarthik
Srikarthik
ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని చూసి త‌మిల ప‌రిశ్ర‌మ జ‌ల‌సీగా ఫీల‌వుతుంది. నిజం చెప్పాలంటే వారిలో జెలసీ వుంది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడుతోంది. తెలుగు దర్శకులకు మంచి బడ్జెట్ వుందని తమిళ్ ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు- అని- ఒకే ఒక జీవితం ద‌ర్శ‌కుడు శ్రీ‌కార్తీక్ త‌న మ‌న‌సులోని మాట‌ను తెలిపారు.
 
హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు.
 
మొదటి సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. సరైన హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన రెండేళ్ళు... సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. చాలా ఆనందంగా వుంది.
 
ఈ కథ ఆలోచన రావడానికి కారణం మీ అమ్మగారేనా ?
అవును. తను బెడ్ మీద వున్నపుడు నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించాలని అనుకున్నా. కానీ తను అప్పటికే అపస్మారక స్థితిలో వున్నారు. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని కూడా తనకి తెలీదు. ఆ విషయంలో రిగ్రేట్ వుండేది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ కథకు భీజం వేసింది.
 
ఎమోషన్ ని సైన్స్ లో ఎలా బ్లండ్ చేశారు ?
నాకు సైన్స్ చాలా ఇష్టం. ఇందులో సైన్స్ లేకపోతే మెలో డ్రామా అయ్యేది. ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కథని సైన్స్ తో    ట్రీట్ చేశా. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. మేము అనుకున్న విజయం సాధించింది. భవిష్యత్ లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తాయని భావిస్తాను.
 
శర్వానంద్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. శర్వా లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. శర్వాకి ఒక మంచి సినిమా, మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందనినమ్మా. ఆ నమ్మకం నిజమైయింది.
 
అమల గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ?
అమల గారిని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత అమల గారికి చాలా నచ్చింది. వెంటనే సినిమా చేస్తానని చెప్పారు.
 
మీలో ఒక డ్యాన్సర్, నటుడు, దర్శకుడు, నిర్మాత వున్నారు కదా.. ఈ కోణాలు గురించి చెప్పండి ?
ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నా. అదికాకపొతే న్యూయార్క్ స్కూల్ లో డ్యాన్స్ లో మాస్టర్స్ చేయాలనీ అనుకున్నా. ఇదే సమయంలో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. రాధిక, గౌతమి గారు ఆ షోకి న్యాయ నిర్ణేతలు. నా ఎక్స్ ప్రెషన్, యాక్టింగ్ బావుందని మెచ్చుకున్నారు. నాలో ఒక నమ్మకం వచ్చింది. నటుడ్ని కావాలని చాలా తిరిగా. రెండేళ్ళు అవకాశాలు రాలేదు. తర్వాత నేనే రాయాలి నేనే తీయాలి అనే నిర్ణయానికి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశా.
 
 ఒకే ఒక జీవితానికి ఐదేళ్ళు పట్టిందని చెప్పారు కదా.. మరి షూటింగ్ ఎన్ని రోజులు తీసుకున్నారు ? షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాది పట్టింది. షూటింగ్ ని త్వరగానే పూర్తి చేశాం. రెండు భాషల్లో కలిపి 78 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశాం. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా(నవ్వుతూ)
 
ఈ చిత్రానికి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ఏమిటి ?
సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు శర్వానంద్ తో ''ఇకపై నిన్ను నా కొడుకులా చూస్తా'' అన్నారు. ఈ కాంప్లీమెంట్ నాకు దొరకలేదు కానీ అది నాకు దక్కిన కాంప్లీమెంట్ లానే భావిస్తా. అలాగే అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యారు. రెండురోజుల పాటు ఆ ఎమోషన్ నుండి బయటికిరాలేకపోయారు. అఖిల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావాలి. కానీ ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేయలేక రాలేకపోయారు. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు సినిమా గురించి కాకుండా జీవితం గురించి మాట్లాడకుంటాం. అది ఒకే ఒక జీవితం కు జరిగింది. అలాగే మారుతి గారితో పాటు మరికొందరు దర్శకులు సినిమా గురించి గొప్ప గా మాట్లాడారు.
 
సింగీతం శ్రీనివాస్ గారిని కలిశారా ?
ఇంకా లేదండీ. ఆయన్ని కలసి సినిమా చూపించి బ్లసింగ్స్ తీసుకోవాలి. ఇలాంటి చిత్రాలకు ఆయన ట్రెండ్ సెట్టర్.
 
కొత్త గా చేయబోయే సినిమాలు ?
మంచి ప్రొడక్షన్ కోసం చూస్తున్నా. నా కొత్త సినిమా తెలుగులో ఉండబోతుంది. పెద్ద స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా చేయాలనే ఆలోచన వుంది. అన్ని జోనర్స్ ఇష్టం. ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ లో వుంటుంది. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలనీ వుంది. ఆయనకి వెళ్లి కథ చెప్పాలి. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే. మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ ఫ్యాన్సే. ఆయనతో సినిమా కోసం ఐదేళ్ళు నిరీక్షంచడానికి కూడా ఓకే. నా కెరీర్ లో ఐదు సినిమాలు చేసినా అవన్నీ కూడా మంచి సినిమాలుగా ఉండాలనేదే నా లక్ష్యం.