నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అక్కినేని అమల, నాజర్ , వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ తదితరులు.
సాంకేతికవర్గం- సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్, సంగీత దర్శకుడు: జెక్స్ బిజోయ్, నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, దర్శకత్వం : శ్రీ కార్తీక్
విడుదల తేదీ : సెప్టెంబర్ 09, 2022
శర్వానంద్, అమలా తల్లీకొడుకులుగా నటించిన సినిమా ఒకేఒక జీవితం. దర్శకుడు శ్రీ కార్తీక్ తన తల్లి పుష్పలత స్మత్యర్థం ఈ సినిమాకు కథ రాసుకున్నానని అదీ టైం మిషన్‌తో ఎలా కలవవచ్చో అనే పాయింట్‌తో తీశానని విడుదలకుముందే చెప్పేశాడు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), చైతు (ప్రియదర్శి) ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. పెద్దయ్యాక ఆది మ్యూజిక్ టీజర్ కావాలనుకుంటాడు. శ్రీను ఇళ్ళ బ్రోకర్‌గా మారతాడు. చైతు ఏదో జాబ్ చేస్తూ పెండ్లి చేసుకోవాలనేది ఎయిమ్. వీరంతా తమ ప్రస్తుత పరిస్థితి పై అసంతృప్తి గా ఉంటారు. 1998లో తన తల్లి చనిపోయిన జ్ఞాపకాలు ఆదిని వెంటాడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే వీరి జీవితాల్లోకి సైంటిస్ట్ (నాజర్) వస్తాడు. అతను కనిపెట్టిన టైమ్ మిషన్ తో ఈ ముగ్గురు తమ గతంలోకి వెళ్లి, తమ ప్రస్తుతం సమస్యలను అలాగే భవిష్యత్తును గొప్పగా మార్చుకోవాలని అనుకుంటారు. అలా గతంలోకి వెల్ళినవారు అనుకోకుండా టైంమిషన్ వల్ల ఓ దశలో ఇరుక్కుపోతారు. ఆ తర్వాత వీరి జర్నీ ఎటువైపు ఎలా సాగింది ? చివరకు వీరి జీవితాలు ఏమయ్యాయనేది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ-
గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం వచ్చింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్ళి అక్కడ ముందుగానే జరిగిపోయిన వాటిని బాలయ్య ఎలా గ్రహించి అక్కడివారిని ఎంటర్‌టైన్ చేస్తాడనేది సింగీతం శ్రీనివాస్ చూపించారు. కానీ ఒకేఒక జీవితంలో ముగ్గురు వర్తమానం నుంచి గతానికి వెళ్ళి, ఆ తర్వాత అనుకోకుండా భవిష్యత్‌కు వెళితే ఎలా వుంటుందనేది పాయింట్. దీన్ని ఏ మాత్రం బోర్ లేకుండా దర్శకుడు కార్తీక్ చేసిన ప్రయత్నం అభినందనీయం. ముఖ్యంగా అమ్మ ప్రేమకు సంబంధించి వచ్చే సన్నివేశాల్లో హృదయం బరువెక్కుతుంది. పైగా సినిమాలో సెంటిమెంట్, ఎమోషనలే కాదు, నావెల్టీ కూడా చాలా బాగుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా తెలుగు తెరకు ఈ పాయింట్ చాలా కొత్తగా ఉంది.
- శర్వానంద్ ఈ సినిమాలో తగిన పాత్రను చేసి మెప్పించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతో ఆకట్టుకుంది. రీతూ వర్మ పాత్ర ఓకే. ఈ సినిమా కథనంలోనే వెన్నెలకిశోర్, ప్రియదర్శి సీన్స్ చాలా బాగా మెప్పిస్తాయి. నాజర్ నటన కూడా సహజంగా ఉంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
- ఇక సెకండాఫ్‌లో కాస్త లాజికల్ అనిపించదు. అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా ఎమోషనల్ గా చూపించాడు శ్రీ కార్తీక్. కానీ, ఎందుకో ప్లేను మాత్రం చాలా స్లోగా నడిపాడు. అయితే పూర్తిగా ఎమోషన్స్‌ను బాగా పండించాడు. చూసిన ప్రేక్షకుడు ఫీల్‌తో బయటకు వస్తాడు.
- మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా మదర్ యాక్సిడెంట్ సీక్వెన్స్ లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్. దర్శకుడు శ్రీ కార్తీక్ స్క్రిప్ట్ పరంగానే కాకుండా, డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు రొటీన్ కథలకు భిన్నంగా కంటెంట్ తోపాటు ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంది. కుటుంబంతో హాయిగా చూసే సినిమా.
రేటింగ్-3/5