సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (10:16 IST)

అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం.. బిగ్ బాస్ సెట్ ఏమైంది..?

Annapurna studio
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్య్యూట్ వల్లే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం. 
 
అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం ఏర్పడిన ఈ అగ్ని ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు.
 
అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌ స్టూడియోలో బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి కుడివైపున బిగ్‌బాస్‌ హౌజ్‌ ఉండటమే దీనికి కారణం. అయితే, మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్‌ నిర్వహణకు ప్రమాదమేమీ లేదని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.