శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (17:55 IST)

నా భార్యతో గడపలేకపోయా: 'గౌతమిపుత్రశాతకర్ణి' దర్శకుడు క్రిష్‌

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్‌లో ఉండగానే పెళ్ళయింది. పెళ్లైన తర్వాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్యతో గడపలేదు. నా భార్య చాలా గర్వపడే సినిమా తీశాను. ఈ సినిమా ఒక రూపం నా కంటి ముందు ఆవిష్కృతమైంద

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్‌లో ఉండగానే పెళ్ళయింది. పెళ్లైన తర్వాత పట్టుమని పదిరోజులు కూడా నా భార్యతో గడపలేదు. నా భార్య చాలా గర్వపడే సినిమా తీశాను. ఈ సినిమా ఒక రూపం నా కంటి ముందు ఆవిష్కృతమైంది. గౌతమిబాల వేసిన శాసనాల ఆధారంగా కొంత విషయం సంగ్రహించాను. లండన్‌లో మనకు తెలియని మన జాతి గొప్పతనం ఎక్కడో ఉంది. సివిల్స్‌ చదివే ఓ పుస్తకంలో 35 పేజీలు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి విషయం దొరకడంతో సినిమాను అక్కడ నుండి స్టార్ట్‌ చేశాం. బి.ఎన్‌.శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ శాతకర్ణి గురించి చెప్పిన విషయాలను తెలుసుకున్నాను. 
 
ఈ క్రమంలో మహారాష్ట్రలోని కొంతమంది మిత్రులకు సినిమా చేస్తున్నానని చెప్పగానే నువ్వు మహారాష్ట్ర వీరుడు కథ చేస్తున్నావా అన్నారు. అదేంటి శాతకర్ణి తెలుగువాడు అన్నాను. అంటే వీర శివాజీ తల్లి జిజియా బాయి శివాజీకి నువ్వు గౌతమిపుత్ర శాతకర్ణి అంత గొప్పవాడివి కావాలని అనే చెప్పేదని వారు చెప్పారు. అలాగే కన్నడలో నూట్రవర్‌ కన్నడ్‌ అని పిలుచుకుంటారని తెలిసింది. అలాగే మెగస్తనీస్‌ రాసిన ఇండికా గ్రంథంలో శాతకర్ణి గురించి తెలిసింది. పాశ్చాత్యుల దగ్గరున్న చరిత్ర మన దగ్గర లేదు. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ గ్రీకులోనో, రోమ్‌లోనో పుట్టి ఉంటే ఆయనపై వంద పుస్తకాలు వచ్చుండేవి. పది సినిమాలు వచ్చుండేవి, కనీసం మూడు ఆస్కార్‌లైనా వచ్చుండేవి. కానీ ఖర్మ మనమేం చేయలేదు. 
 
ఆయన గురించి చదువుతుంటే నా రక్తం మరిగింది. మరి ఇలాంటి చక్రవర్తి ఎలా ఉండాలి. ఆ శాతకర్ణి చూపు తీక్షణంగా ఉండాలి. ఆయన నడుస్తుంటే కాగడా రగులుతున్నట్లు ఉండాలి. కథే కథానాయకుడిని ఎన్నుకుంటుంది. అడుగో బాలకష్ణనే శాతకర్ణిగా సరిపోతాడని ఆ రాజే నాకు చెప్పినట్టు అనిపించింది. ఇది నేనేదో ఆవేశంతో చెబుతున్న మాటలు కావు, ఆలోచించి చెబుతున్న మాటలు. ఎప్పుడో శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని ఏలడం ఏంటి, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావడమేంటి? అంతా దైవసంకల్పం అని చెప్పారు.