ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : మా అధ్యక్షుడు నరేష్
ఈరోజు ఇండస్ట్రీ గీతాంజలిగారి లాంటి ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. అమ్మ... విజయనిర్మలతోనూ ఆవిడకు మంచి అనుబంధం ఉంది. ఇక నటిగా ఆవిడ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది భాషల్లోనే కాదు.. హిందీలోనూ నటించారు. నటిగానే కాదు.. వ్యక్తిగతంగానూ గీతాంజలిగారు ఎప్పుడూ సంతోషంగా, అందరితో కలివిడిగా ఉండేవారు. అలాంటావిడ ఉన్నట్లుండి ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోతారని అనుకోలేదు.
ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అందరికీ ఆమె ఎంతో చేరువగా ఉండేవారు. మంచిచెడుల్లో భాగమైయ్యేవారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టిపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్రను వేశారు గీతాంజలి.
నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు తీరని లోటు అని అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు తెలిపారు. శ్రీమతి గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.