మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (17:41 IST)

ఘనంగా ఆదిపురుష్ రామ కోటి ఉత్సవం

Adipurush Rama Koti festival
Adipurush Rama Koti festival
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించారు. కృతి సనన్ సీతగా కనిపించింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. గత శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో రామ జయం, రఘురామ జయం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా మాటల రచయిత శ్రీనివాస్ మాట్లాడుతూ - యుగాలు, తరాలు మారినా రామ కథ మారదు. రాముడి మీద మనకున్న భక్తి, గౌరవం మారవు. తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదిపురుష్ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు
 
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ - ఆదిపురుష్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. నైజాంలో దాదాపు 500 స్క్రీన్స్ కి పైగా సినిమాను రిలీజ్ చేశాం. యూత్ ఒక అంచనాతో సినిమాకు వచ్చారు. కానీ 20 ఏళ్లలోపు పిల్లలంతా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్, ఓ రౌత్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. తొలి రోజు నైజాంలో 13.65 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి. ఇది ఒక స్టార్ హీరోకు రికార్డ్ స్థాయి కలెక్షన్. రెండో రోజు దాదాపు 8 కోట్ల రూపాయలు వచ్చాయి. థియేటర్ల దగ్గర ప్రేక్షకుల స్పందన బాగుంది. కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. అన్నారు.
 
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాస్తానని అడిగి మరీ తీసుకున్నాను. యూవీ సంస్థతో నాకున్న అనుబంధం అలాంటిది. ఐదు పాటలు, మూడు బిట్ సాంగ్స్ రాశాను. అన్నింటికీ మంచి పేరు దక్కింది. జ్యూక్ బాక్స్, పాటలకు అద్భుతమైన ఆదరణ వస్తున్నది. ఈ చిత్ర విజయంలో నా పాటలు భాగం కావడం సంతోషంగా ఉంది. ఈతరం వారికి రామకథను చెప్పాలనే గొప్ప సంకల్పంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన సంకల్పంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఆయన ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఈ సినిమాను అంత ఎమోషన్ తో తెరకెక్కించారు. అన్నారు.
 
సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ - నిన్నటి వరకు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ సభను రామకోటి ఉత్సవంగా పిలవాలని అనుకున్నాం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ అనుకున్నది ఏంటంటే..రామనామాన్ని ప్రతి గడపకు చేర్చాలని. ఆ ప్రయత్నంలో మేము సఫలీకృతం అయ్యాం. ట్రోల్ చేసేవారు కూడా పరోక్షంగా రాముడిని తలుచుకుంటున్నారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లన్నీ సరికొత్త రికార్డులు సృష్టించాయి. మంచి ప్రయత్నానికి తప్పకుండా ప్రజల సహకారం ఉంటుందని ఈ సినిమా విజయం నిరూపించింది. ఇప్పటి పిల్లలకు హాలీవుడ్ సూపర్ హీరోస్ తెలుసు. కానీ మన  జాంబవంతుడు, అంగదుడు వంటి పౌరాణిక వీరులు తెలియదు. ఇవాళ మా చిత్రం ద్వారా పిల్లలు వారిని గురించి తెలుసుకుంటున్నారు. నెల్లూరులో ఓ స్కూల్ పిల్లలందరినీ ఈ సినిమా షోకు తీసుకువెళ్లారు. ఆదిపురుష్ చాలా కాలం థియేటర్స్ లో ఉంటుంది. అన్నారు.
 
ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత తమకు కలిగిన అనుభూతిని వేదిక మీద పంచుకున్నారు.