శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 22 జూన్ 2020 (14:35 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌: మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ ఉదయభాను

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్కులో మూడు మొక్కలు నాటారు యాంకర్ ఉదయభాను. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... మొక్కలను నాటి పెంచడం మనందరి కర్తవ్యం అన్నారు. మన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఒక నెల రోజులు భోజనం లేకుండా ఉండగలము. ఒక వారం రోజులు నీరు లేకుండా ఉండగలం. కానీ ఆక్సిజన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము.
 
ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాము. కరోనా లాంటి వివిధ రకాల వైరస్‌ల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం కాబట్టి ముందుతరాల వారికి మంచి వాతావరణం అందించడం మన అందరి బాధ్యత. ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా చాలెంజ్‌ని ప్రారంభించడం చాలా గొప్ప విషయం.
 
ఇది ఎంతో అందమైన చాలెంజ్. మొక్కలు నాటాలని చాలెంజ్‌తో ప్రజల్లోకి తీసుకురావడం గొప్ప విషయం. ఒక్క మొక్కతో మొదలు పెట్టి ఈరోజు కోట్లాది మొక్కలను దేశవ్యాప్తంగా నాటించడం జరిగిందని నేను విన్నాను. ఒకప్పుడు మొక్కలు పెట్టండి పెట్టండి అని ప్రజలను బ్రతిమిలాడేవారు, కాని ఇప్పుడు మాకు మొక్కలు ఇవ్వండి ఇవ్వండి అనే చైతన్యం వచ్చిందన్నారు.
 
నా చిన్నతనంలో ఈ ప్రాంతంలో సర్కారు తుమ్మలు కనిపించేవి. ఇప్పుడు మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నినాదం పట్టుదల వల్లనే సహకారం అయింది. దీనిని స్పూర్తిగా తీసుకొని సంతోష్ గారు కీసరగుట్ట పరిధిలో అడవి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. నాకు కూడా పకృతి అంటే చాలా ఇష్టం. అందుకోసమే నా ఇద్దరు కూతుళ్లకు భూమి మరియు ఆరాధ్య అని పేర్లు  పెట్టుకున్నాను.
 
మీరందరూ కూడా చేతనైనంత వరకు చెట్లను పెంచండి. ఇప్పటికే మనం తాగే నీటిని కొనుక్కుంటున్నాం. కొన్ని రోజులు అయితే ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవలసి వస్తుంది. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నాను. 1) ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్. 2) డైరెక్టర్ సంపత్ నంది. 3) ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం. ఈ ముగ్గురు కూడా నా ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.