ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (18:32 IST)

నాది చాలా హ్యాపీ మ్యారేజ్- నజ్రియాలా ఎవ‌రూ క‌నిపించ‌లేదు - నాని ఇంటర్వ్యూ

Nani
Nani
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ 'అంటే సుందరానికీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా తెలుగు లో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.  జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం  భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యం లో హీరో నాని మీడియాతో ''అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. ఆయన పంచుకున్న చిత్ర విశేషాలివి.
 
దర్శకుడు వివేక్ ఆత్రేయ కథ చెప్పినపుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ?
చాలా మంది రెండు, మూడు సినిమాలు చేసిన దర్శకులతో సినిమా ఎందుకని అడుగుతుంటారు. వివేక్ ఆత్రేయని కలసినప్పుడు, ఆయన కథ చెప్పినపుడు, పని చేస్తున్నపుడు ఆయన ఫ్యూచర్ టాప్ డైరెక్టర్ అనే నమ్మకం బలంగా కలుగుతుంది. ఆయన రైటింగ్ డైరెక్షన్ అంత బావుంటాయి. ప్రజంట్ లీడింగ్ దర్శకులు కంటే ఫ్యూచర్ లీడింగ్ దర్శకుల జర్నీలో భాగం కావడం ఒక ఆనందం. నేను చూసిన దర్శకుల్లో వివేక్ ఒక జెమ్. తనకంటూ ఒక ఒరిజినల్ స్టైల్ వుంది. ఇది తన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. తన సినిమా కథని ఇంకెవరికి ఇచ్చినా తన లాగా తీయలేరు. వివేక్ లాంటి దర్శకుడితో పని చేయడం చాలా ఆనందం.
 
కామెడీ టైమింగ్ ప‌రంగా 'అంటే సుందరానికీ' ఎలాంటి కొత్తదనం చూపించబోతున్నారు ?
అంటే సుందరానికీ'లో చాలా భిన్నమైన టైమింగ్ వుంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి టైమింగ్ వున్న పాత్ర చేయలేదు. నా పాత సినిమాల డైలాగ్ టెంప్లేట్ కి ఈ సినిమా ఎక్కడా మ్యాచ్ అవ్వదు. వివేక్ అలా మ్యాచ్ కాకుండా కొత్తగా రాసుకున్నాడు. నేను పాత నానిలా చేద్దామని అనుకున్నా చేయలేని విధంగా రాసుకున్నాడు. చాలా హిలేరియస్ గా వుంటుంది. కొత్త నాని, కొత్త టైమింగ్ చూస్తారు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
 
బ్రాహ్మణ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారు కదా.. ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేశారా ?
బ్రాహ్మణ పాత్రే కాదు కొన్ని పెక్యులర్ పాత్రలు నేపధ్యాలు ఇచ్చినపుడు కొంచెం ఎక్కువగా  డ్రమటైజ్ చేయడం కనిపిస్తుంటుంది.  కానీ 'అంటే సుందరానికీ' అలా కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. ఇందులో చాలా ప్రామాణికమైన వాతావరణం కనిపిస్తుంది. చిన్న చిన్న డిటేయిల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి.  సినిమా చూస్తున్నపుడు మీరు కూడా పాత్రల మధ్యలో వున్నట్లు ఫీలౌతారు.
 
పాత్ర లో అమాయకత్వం కనిపిస్తుంది కదా.. ఎలా ప్రిపేర్ అవుతారు?
మిగతా వాటితో పోల్చుకుంటే అమాయకత్వం చేయడం నాకు కొంచెం సులువే. స్క్రిప్ట్ లోనే ఆ అమాయకత్వం వుంటే ఇంకా బావుంటుంది. ఇందులో సుందర్ అమాయకత్వం మాత్రం డిఫరెంట్ లెవల్ వుంటుంది. సినిమాకి ముందు..  సిగరెట్ మందు తాగొద్దని వార్నింగ్ వస్తుంది కదా.. మా సినిమాకి వచ్చేసరికి 'సుందర్ మందు సిగరెట్ తాగడు ఈ ఒక్క విషయంలోనే వీడిని ఫాలో ఆవ్వోచ్చని''  వస్తుంది. (నవ్వుతూ)..  అంటే సుందర్ పాత్ర ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సుందర్ ట్రైలర్, టీజర్ లో కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. దర్శకుడు వివేక్ అదే పాయింట్ ముందు చెప్పి  ''సుందర్ చాలా వరస్ట్ ఫెలో సర్. కానీ ప్రతి ఫ్రేములో వీడిని ప్రేమించాలి'' ఇదే సుందర్ లో వుండే మ్యాజిక్.  సుందర్ వరస్ట్ యాంగిల్ అంతా అమాయకత్వంలో బయటికి వస్తుంది. సుందర్ ఇన్నోసెంట్ కన్నింగ్ ఫెలో. (నవ్వుతూ)
 
Nani
Nani
మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు కదా.. ఏమైనా సమస్యలు ఎదురుకున్నారా ?
లేదండీ నాది చాలా హ్యాపీ మ్యారేజ్. ఇరు కుటుంబాలు చక్కగా మాట్లాడుకొని వివాహం జరిపారు. ఐతే వాళ్ళది సైంటిస్ట్ ల ఫ్యామిలీ. నేను సినిమాలు చుట్టూ  తిరుగుతున్నాను. మొదట్లో కొంచెం కంగారు పడ్డారు. ఐతే నాపై వాళ్ళకు నమ్మకం కుదిరి ఆనందంగా పెళ్లి జరిగింది.
 
లీలా పాత్ర నజ్రియా చేయాలనేది ఎవరి నిర్ణయం ?
నేను, వివేక్ ఇద్దరం అనుకున్నాం. లీలా పాత్ర అనుకున్నపుడు నజ్రియా లా వుండే హీరోయిన్స్ ఎవరు ? అనే వెదకడం మొదలుపెట్టాం. ఎవరూ కనిపించలేదు. నజ్రియా లాగా ఎందుకు నజ్రియానే అయితే ఎలా వుంటుందని భావించి ఆమెను సంప్రదించాం. అప్పటికే చాలా పెద్ద సినిమా ఆఫర్లకి కూడా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఈ కథ విన్నవెంటనే 'నేను చేస్తా' అని ఎగిరిగంతేసింది. లీలా పాత్రలోకి ఆమె రావడం ఆ పాత్రకు న్యాయం జరిగింది. ఫాహాద్ కూడా ఈ సినిమా గురించి చాలా ఎక్సయిటెడ్ గా వున్నారు. మొన్న కొచ్చి ప్రమోషన్స్ కి వెళ్ళినపుడు వాళ్ళ ఇంట్లోనే వున్నాం.
 
తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతుందా కదా? దిన్ని ఎలా చూస్తారు ?
నిజానికి ఇది గోల్డెన్ ఫేజ్. మనకే కాదు సినిమాకే మంచి ఫేజ్. సినిమా బావుంటే ప్రాంతానికి సంబంధం లేకుండా విజయం సాధిస్తుందంటే మంచి రోజులు వచ్చాయనే అర్ధం.
 
మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
అద్భుతమైన సినిమాలు ప్రోడ్యుస్ చేస్తున్న లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. చాలా మంచి సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నవీన్ గారు, రవి గారు చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు. గ్యాంగ్ లీడర్ తో మా జర్నీ మొదలైయింది. ఆ సినిమా మాస్ క్లాస్ అందరినీ ఆకట్టుకుంది. అంటే సుందరానికీ కూడా గొప్ప విజయం సాధిస్తుంది.
 
పాన్ ఇండియా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?
నా ఉద్దేశంలో మన సినిమాని మనం పాన్ ఇండియా అనుకుంటే కాదు. ప్రేక్షకులు అంటేనే పాన్ ఇండియా. కంటెంట్ బలంగా వుండాలి. పుష్ప సినిమా తీసుకుందాం.. సౌత్ అడవుల్లో జరిగిన కథ. నార్త్ తో ఆ కథకి సంబంధం లేదు. కానీ దేశం మొత్తం పుష్పని ఆదరించారు. పాన్ ఇండియా స్టేటస్ ఇచ్చారు. ముందు కంటెంట్ పై ద్రుష్టి పెట్టాలి తప్పితే మనకి మనమే పోస్టర్ పై పాన్ ఇండియా అని రాసుకోవడం సరికాదని నా ఉద్దేశం.
 
ఈ మధ్య ఏదైనా పాత్ర చూసినప్పుడు ఇలాంటి సినిమా చేసుంటే బావుండనిపించిందా ?
జైభీమ్ చూసినప్పుడు ఇలాంటి సినిమా నా కెరీర్ లో వుంటే బావుండనిపించింది. అలాగే తెలుగులో ఇలాంటి కథలు చెప్పాలనిపించింది.
 
దసరా ఎక్కడి వరకూ వచ్చింది ?
25శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగులో వస్తున్న పవర్ ఫుల్ రా మూవీ ఇది.
 
మీ ప్రొడక్షన్ లో రాబోతున్న సినిమాలు ?
మీట్ క్యూట్ అనే సినిమా వస్తుంది. డైరెక్ట్ డిజిటల్. త్వరలోనే ప్రకటిస్తాం. అలాగే హిట్ 2. ఇది భారీ గా వుంటుంది. మేజర్ తో అడవి శేష్ హిట్ కొట్టారు. హిట్ 2ఏ మాత్రం తగ్గదు. ఈ ప్రాంచైజీ కొనసాగుతుంది.