మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (07:15 IST)

జీవిత నాకిస్తున్న బహుమతి ఇది.. చిరంజీవి మెచ్చుకున్నారు : రాజశేఖర్

సీనియర్‌ కథానాయకుడు రాజశేఖర్‌ నటించిన చిత్రం ‘పీఎస్‌వీ గరుడవేగ 126.18ఎం’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, సంజయ్‌రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ నటి సన్నీలియోని ఓ ప్రత

సీనియర్‌ కథానాయకుడు రాజశేఖర్‌ నటించిన చిత్రం ‘పీఎస్‌వీ గరుడవేగ 126.18ఎం’. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, సంజయ్‌రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ నటి సన్నీలియోని ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. దాదాపు రూ.30కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈనెల మూడో తేదీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ... రూ.30 కోట్లతో తీసిన సినిమా ఇది. ఈ కథని రూ.8 కోట్లతోనూ తీయొచ్చు. రూ.30 కోట్లూ పెట్టొచ్చు. ఖర్చు పెరిగే కొద్దీ నాణ్యత కనిపిస్తుంది. రూ.8 కోట్లతో తీస్తే.. పోరాట దృశ్యాల్ని మేం అనుకొన్న స్థాయిలో తెరకెక్కించడానికి సాధ్యమయ్యేది కాదు. ఇక మార్కెట్‌ అంటారా? ఈ రోజుల్లో సినిమా బాగుంటే ఎంతైనా తిరిగి రాబట్టుకోవచ్చన్నారు. 
 
'గతంలో తాను నటించిన సినిమాలూ వేరు, ‘గరుడవేగ’ వేరు. నా కెరీర్‌లో అత్యంత సంతృప్తినిచ్చిన చిత్రమిది'. 'నాకెప్పటి నుంచో జేమ్స్‌ బాండ్‌ తరహా సినిమాలు చేయాలని ఆశ. చాలామంది దర్శకులకు, నిర్మాతలకూ ఈ విషయం చెప్పా. 'బాగుంటుందండీ' అనేవాళ్లే. కానీ ఎవ్వరూ సాహసించలేదు. ఎందుకంటే ఆ తరహా కథలు తెరకెక్కించాలంటే భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాలి. నా కల అలానే ఉండిపోతుందేమో అనుకొంటున్న తరుణంలో ప్రవీణ్‌ సత్తారు వచ్చారు. ‘మగాడు 2’ అనే స్క్రిప్టు చెప్పారు. ‘అదిరిపోయింది.. నేను ఎదురుచూస్తోంది ఈ కథ గురించే కదా’ అనుకొన్నా. మా నాన్నగారి స్నేహితుడు ఎప్పటి నుంచో నాతో సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఈ కథ వినిపించాం. వినగానే నచ్చింది. అలా ఈ సినిమా పట్టాలెక్కింది' అని చెప్పుకొచ్చారు. 
 
ఈ చిత్రం షూటింగ్ సమయంలో జీవిత సహకారం మర్చిపోలేనిది. ‘మా ఆయనకు మంచి హిట్‌ రావాలి’ అని తపన పడింది. ఒక విధంగా జీవిత నాకు ఇస్తున్న బహుమతి ఈ సినిమా’. ‘ధృవ’లో అరవింద్‌ స్వామి పాత్ర చూడండి. ఎంత బాగుంటుందో? అలాంటి కథలతో వస్తే తప్పకుండా ప్రతి నాయకుడి పాత్రను చేస్తా. ఈ మధ్య చిరంజీవిని కలిశాను. ‘నా సినిమా చూడండి’ అంటూ ఆహ్వానించా. అప్పటికే ఆయన ‘గరుడవేగ’ ట్రైలర్‌ చూశారట. ‘మా ఆఫీసులోనూ నీ సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు. నేనూ ట్రైలర్‌ చూశా. బాగుంది’ అంటూ మెచ్చుకొన్నారు’ అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.