బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (08:58 IST)

ఐసీయూలో హీరో రాజశేఖర్.. ఆరోగ్యం ఎలా వుంది.. వైద్యులు ఏమంటున్నారు?

ఇటీవల కరోనా వైరస్ బారినపడిన తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌ను ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ వైరస్ బారినపడిన ఆయన భార్య, సీనియర్ నటి జీవిత రాజశేఖర్‌ను మాత్రం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆమెకు జరిపిన తాజా పరీక్షల్లో కోవిడ్ నెగెటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఇంటికి పంపించారు. 
 
అయితే, ఐసీయూలో ఉన్న హీరో రాజశేఖర్ హెల్త్ గురించి ఆస్పత్రి వైద్యులు ఓ హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేశారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. 
 
ఓ వైద్య బృందం ఆయననే నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. తమ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. రాజశేఖర్ భార్య జీవిత కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఈరోజు చేసిన కోవిడ్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశామని చెప్పారు.
 
ఇకపోతే, తన తండ్రి ఆరోగ్యంపై రాజశేఖర్ కుమార్త శివాత్మిక కూడా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. డాడీ పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సిటీ న్యూరో సెంటరు డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని వైద్యుల బృందం తన తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలిపారు. 
 
వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.