శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (13:12 IST)

విద్యార్థినిని విందుకు పిలిచి వైస్ ప్రిన్సిపాల్‌ అలా ప్రవర్తించాడు

హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ కాలేజీ విద్యార్థినిని విందు పేరిట తన ఇంటికి పిలిచిన వైస్ ప్రిన్సిపాల్‌ ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకుని బయటపడ్డ యువతి ఈ నెల 9వ తేదీ రాత్రి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని అల్వాల్‌కి చెందిన ఓ యువతి రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాకు చెందిన కల్యాణ్ వర్మ ఇదే కాలేజీలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 29వ తేదీ సాయంత్రం విందు పేరుతో కల్యాణ్ వర్మ ఆ యువతిని తన ఇంటికి పిలిచాడు. దీంతో సోదరుడిని వెంటపెట్టుకుని ఆ యువతి అక్కడికి వెళ్లింది.
 
సోదరుడిని ఇంటి బయటే ఉండమని చెప్పి ఆమె మాత్రమే లోపలికి వెళ్లింది. ఆ సమయంలో కల్యాణ్ వర్మతో పాటు రవీందర్ అనే మరో లెక్చరర్ రవీందర్ కూడా అక్కడే ఉన్నాడు. కొద్దిసేపు యువతితో ముచ్చటించిన ఆ ఇద్దరు.. ఆపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న యువతి ఈ నెల 9న రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.