గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (17:09 IST)

చావును దగ్గరనుంచి చూశా, దాన్నుంచి చాలా నేర్చుకున్నాః శశి ప్రీతమ్

Shashi Pritam, Aishwarya Krishnapriya and ohters
ప్రముఖ సంగీత దర్శకుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ శశి ప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా 'లైఫ్ ఆఫ్ 3'. ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మించారు. దుష్యంత్ రెడ్డి సహ నిర్మాత. స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. వైశాలి, సౌజన్య వర్మ, లోహిత్ కుమార్, సీవీఎల్ నరసింహారావు, వైభవ్ సూర్య సహాయ తారాగణం. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఛాయాగ్రహణ, సంగీత, దర్శకత్వ బాధ్యతలను శశి ప్రీతమ్ నిర్వర్తించారు. శశి ప్రీతమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, ఆడియో బుధ‌వారం రాత్రి విడుదల చేశారు. సినిమాలో పాటలన్నీ శశి ప్రీతమ్ రాశారు.
 
శశి ప్రీతమ్ మాట్లాడుతూ "ఈ ఏడాది జనవరిలో 'లైఫ్ ఆఫ్ 3' సినిమా ప్రారంభించాం. గతేడాది తీవ్ర గుండెపోటుకు గురైనప్పుడు చావును దగ్గరనుంచి చూశా. దాన్నుంచి చాలా నేర్చుకున్నాను. చివరి క్షణం వరకూ పోరాటం చేయడం ఆపవద్దు, నెవర్ గివ్ అప్ అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. మనం ఎప్పుడూ పోరాడుతూ ఉండాలి. ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నంతసేపూ జీవితం అనేది ఒక ఆటలా ఉంటుంది. అదే ఉద్దేశంతో ఈ కథ రాశా. మా సినిమాలో చాలామంది కొత్త నటీనటులు ఉన్నారు. పాటల  ద్వారా చాలామంది కొత్త గాయనీగాయకులను కూడా పరిచయం చేశాం. కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా నిర్మించిన మా అమ్మాయి ఐశ్వర్యకు, ఆమెకు మద్దతుగా నిలిచిన దుష్యంత్ రెడ్డి గారికి థాంక్స్. నా క్లోజ్ ఫ్రెండ్స్ లోహిత్, చిన్నికృష్ణ, వైభవ్ కు కథ రాస్తున్నప్పటి నుండి వినిపిస్తున్నా. ఈ సినిమాలో భాగం కావాలని కోరాను. అలాగే, వాళ్ళు ఈ సినిమాలో చేశా" అని అన్నారు.
 
లోహిత్ మాట్లాడుతూ, శశి ప్రీతమ్ గారు జింగిల్ కు 50 రూపాయలు తీసుకునేటప్పటి నుండి తెలుసు. 55 సినిమాలకు అద్భుత సంగీతం అందించాడు. తనలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. చక్కటి సంగీతం ఇవ్వగలడు. పాటలు రాయగలడు. ఎడిటింగ్ చేయగలడు. కెమెరాతో షూటింగ్ చేయగలడు. నాకు తెలిసి ఈ రోజే పుట్టిన శశి ప్రీతమ్ 'లైఫ్ ఆఫ్ 3'. శశి ప్రీతమ్ అంటే ఏంటో చూపించడానికి మళ్ళీ పుట్టానని ఈ సినిమాతో గట్టిగా చెబుతున్నాడు" అని అన్నారు.
 
చిన్నికృష్ణ మాట్లాడుతూ "నేను 23 ఏళ్ళ క్రితం 'సముద్రం'తో ఇండస్ట్రీకి వచ్చాను. ఆ సినిమాకు శశి ప్రీతమ్ మ్యూజిక్ చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత శశి ప్రీతమ్ దర్శకత్వంలో పని చేయడం సంతోషంగా ఉంది. 'లైఫ్ ఆఫ్ 3' అంటున్నారు కదా! ఆ ముగ్గురిలో నేను ఒకడిని. ఆయనతో నేను ఓ చిన్న ప్రాజెక్టు చేశా. నన్ను గుర్తుపెట్టుకుని మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇందులో నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుంది" అని అన్నారు.
 
వైభవ్ సూర్య మాట్లాడుతూ "బయట మాట్లాడటం కంటే స్క్రీన్ మీద నటించడం నాకు ఇష్టం. శశి గారితో ఇంతముందు మంచి మంచి యాడ్స్ చేశా. శశి ప్రీతమ్ జీవితం అంతా ఒక ఎత్తు అయితే... ఈ ప్రాజెక్టు మరో ఎత్తు. నిజంగా అంత మనసుపెట్టి కథపై వర్క్ చేశారు. ఆర్టిస్టులను బాగా ఎంకరేజ్ చేశారు. ఇన్ని ప్రాజెక్టులు చేసిన నాకు కూడా ఈ ప్రాజెక్టు మరో ఎత్తు" అని అన్నారు.
 
శశి ప్రీతమ్ కుమార్తె, సినిమా నిర్మాత ఐశ్వర్య కృష్ణప్రియ మాట్లాడుతూ, నా చిన్నప్పటి నుండి నాన్నతో చాలా ప్రాజెక్టులు చేశా. నా కోసం ఆయన ఎన్నో చేశారు. నాన్న కోసం నేను నిర్మాతగా మారాలని అనుకున్నాను. హీ ఈజ్ సింగిల్ ఫాదర్. నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి ఆయన అంటే ఎంతో గౌరవం, ప్రేమ. టెక్నీషియన్, ప్రొడ్యూసర్ గా నా తొలి అడుగు ఇది. నాన్నకు మద్దతుగా ఉండాలని వేశా" అని అన్నారు.
 
దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ, తరం మారినప్పుడు సంగీతం మారుతుంది. ప్రజల అభిరుచి మారుతుంది. కానీ, శశి ప్రీతమ్ పాటలు ఇప్పుడు ప్లే చేసినా కొత్త తరం కూడా వింటారు" అని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో డాక్టర్ పెరుమాళ్ళు, స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, వైశాలి, సౌజన్య వర్మ, సీవీఎల్, జోసెఫ్ సుందర్, శాస్త్రి ఏఆర్కే, రాజేష్, వీరేన్ తంబిదురై, అనిరుధ్ మంత్రిప్రగడ, విశ్వనాథన్, అజిత్ శుక్లా, వరుణ్ సాధు, ఫహీమ్ సహా గాయనీగాయకులు ఎన్.సి. కారుణ్య, సమన్విత శర్మ, ప్రత్యూష శర్మ, ప్రత్యూష పాళ్ళూరి, ఆదిత్య, విద్యా నారాయణ రాఘవన్, మృదులా శర్మ, వందనా సుశీల్, సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.