గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 13 ఆగస్టు 2019 (15:07 IST)

సంగీత వాద్య కళాకారులకు నా వంతు సాయం చేస్తా! – చిరంజీవి

“సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను. అప్పటి చక్రవర్తి, ఇళయరాజా నుంచి రాజ్ కోటి, ఇప్పటి మణిశర్మ దాకా ఎంతోమంది సంగీత దర్శకుల బాణీలు, పాటలు, సంగీతం పాటలు ద్వారా నేను ప్రజలకు మరింత దగ్గరయ్యాను. వారందరితో అనుబంధాన్ని మర్చిపోలేను” అని హీరో చిరంజీవి అన్నారు. 
 
సినీ మ్యుజీషియన్స్ యూనియన్ పక్షాన హైదరాబాద్‌లో జరిగిన స్వరసంగమం సంగీత విభావరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ సంగీత వాద్య కళాకారుల ఆర్థిక, ఆరోగ్య సంక్షేమం కోసం నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు.
 
“ఒకప్పుడు మద్రాసులో ఏ.వి.ఎం, ప్రసాద్ స్టూడియో లాంటి స్టూడియోలలో పెద్ద రికార్డింగు హాళ్ళలో లైవ్ ఆర్కెస్ట్రాతో పాటలు రికార్డింగ్ చేస్తుంటే పండుగలా ఉండేది. ఇప్పుడు ఆధునిక సాంకేతికత వల్ల చిన్న గదుల్లోనే, డిజిటల్‌‌గా ఆ ఎఫెక్టులను సృష్టిస్తున్నాం. ఆధునిక పరిజ్ఞానానికి సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. 
 
అయితే, దీనివల్ల ఎంతోమంది సంగీత వాద్య కళాకారుల జీవనోపాధి పోవడం, నిపుణులైన కళాకారులు వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతుండటం బాధగా ఉంది. వాళ్ళను ఆదరించి, కష్టాల్లో ఉన్న వాద్య కళాకారులను పరిశ్రమ తరఫున ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు నా వంతుగా నేను సైతం అంటూ సాయమందిస్తా” అని చిరంజీవి సభాముఖంగా ప్రకటించారు.