శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (12:53 IST)

బీజేపీలోకి చిరంజీవి... పవన్‌తో డీల్ కుదిరిందా?

మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు జాతీయ పార్టీ బీజేపీ బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలపై దృష్టి పెట్టింది. సీనియర్లకు పార్టీలో చేర్చుకొని బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కమలం గూటికి చేరిపోయారు. 
 
కాగా... ఇప్పుడు బీజేపీ దృష్టి.. సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిపై పడింది. చిరంజీవిని బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. 
 
చిరంజీవి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని మాణిక్యాలరావు అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ప్రక్రియ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి తమ పార్టీలో చేరాలని అనుకుంటే స్వాగతిస్తామని ప్రకటించారు. కేవలం చిరంజీవి మాత్రమే కాదు ఆయన సోదరుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని.. లేదంటే ఆ పార్టీ మద్దతుతో తన పార్టీని కొనసాగిస్తారనే వార్తలు వినపడుతున్నాయి. 
 
ఇటీవల తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ.. బీజేపీ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఈ రకమైన డీల్ కుదరిందనే వాదనలు వినపడుతున్నాయి. అధికారికంగా అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎవరూ నోరు విప్పలేదు. కాగా, 2009 ఎన్నికల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. 
 
అయితే, 2014 ఎన్నికల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరు, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలో చేరి.. మళ్లీ కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటారేమో చూడాలి.