శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:40 IST)

కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు మెడ ఎత్తడేం: శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాడు కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రం వద్ద మెడలు ఎత్తడం లేదన్నారు.

శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన కేంద్రంలోని బీజేపీ చేస్తున్న ఆగడాలను వైసీపీ ఖడించలేక పోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చట్టం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని శైలజానాథ్ విమర్శించారు. 
 
మరోవైపు బీజేపీపైనా శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో ఏ వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలోని సెక్యూలర్ వ్యవస్థను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ పాలకులపై ప్రజలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగడాలను ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని మాజీమంత్రి శైలజానాథ్ చెప్పుకొచ్చారు.